తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రంతో ప్రచార గడువు ముసిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (అధికార టీఆర్ఎస్), తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (అధికార వైఎస్సార్ సీపీ)లు అనారోగ్యంతో మరణించిన కారణంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు చోట్ల సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికార పార్టీలు పట్టుదలతో ఉండగా ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రతిపక్షాలు ఎలాగైనా గెలిచి తీరాలని చెమటోడ్చుతున్నాయి. ప్రచారం ముగియడంతో ఇక ఓట్లను రాబట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
తిరుపతి లోక్‌సభ పరిధిలో..
తిరుపతి ఎంపీగా బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఈ ఉప ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి డా.గురుమూర్తిని ఆ పార్టీ బరిలోకి దింపగా ప్రతిపక్ష టీడీపీ నుంచి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. ఇక ఏపీలో ఈ ఎన్నికల్లో గెలిచి సంచలనం నమోదు చేయాలని భావిస్తున్న బీజేపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభను పోటీకి దింపగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. మొత్తం 16.5లక్షల మంది ఓటర్లు ఉండగా 2019 ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైంది. తమ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న నమ్మకంతో వైసీపీ ఉండగా జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని టీడీపీ భావిస్తోంది. మోదీ ఛరిష్మా, టీడీపీ, వైసీపీ అవినీతి రాజకీయాలు, జనసేన మద్దతుతో గెలుస్తామని బీజేపీ చెబుతోంది.
ప్రచార అంశాలు..
వైసీపీ 22 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రచారం చేసింది. అదే సమయంలో టీడీపీని కూడా టార్గెట్ చేసింది. ఇంటింటికీ జగన్ లేఖలు, మంత్రుల ప్రచారం కలసి వస్తాయని వైసీపీ చెబుతోంది. టీడీపీ విషయానికి వస్తే అందరికంటే ముందే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా.. కీలక నేతలంతా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేశారు. జగన్ పాలనలో అవినీతి, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా, లోక్‌సభలో వైసీపీ ఎంపీల వ్యవహారశైలి తదితర అంశాలను ప్రచారం చేసింది. వైఎస్ వివేకా హత్యకేసు, ఆలయాలపై దాడుల అంశం, నారా లోకేశ్ ప్రమాణం, సీఎం జగన్‌కి సవాలు, చంద్రబాబుపై రాళ్ల దాడి అంశాలను సానుకూలంగా టీడీపీ భావిస్తోంది. బీజేపీ-జనసేన పార్టీల విషయానికి వస్తే..పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకపోవడంతో పార్టీ కొంత నిరుత్సాహ పడిందని చెప్పవచ్చు. ఇక తిరుపతి ఆధ్యాత్మికత, ఆలయాలపై దాడుల అంశం, మోదీ ఛరిష్మా, కేంద్రం నుంచి హామీలు తదితర అంశాలను ప్రచారం చేస్తోంది. ప్రచారం చివరి నాటికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతానికి సంబంధించిన అంశాన్ని వివాదాస్పదం చేసింది. ఈ పార్టీలతో పాటు సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పోటీకి దిగారు. కాంగ్రెస్ హయాంలో తన సారథ్యంలో అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. మొత్తం మీద తిరుపతి లోక్‌సభ గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయని చెప్పవచ్చు.
నాగార్జునసాగర్‌లో..
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే నోములనర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ని బరిలోకి దింపింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రవికుమార్ నాయక్‌ను బరిలోకి దింపింది. టీడీపీతో పాటు మొత్తం 41మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి పునర్వైభవం దిశగా అడుగులు వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత జరిగిన హుజూర్‌నగర్, దుబ్బాక ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వరుస పరాజయాలతో ఇప్పటికే పార్టీ బలహీనమవుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో గెలిస్తే పార్టీకి పూర్వవైభవం దిశగా అడుగులేస్తుందని, పరాజయానికి బ్రేక్‌లు వేయడంతోపాటు బీజేపీ, టీఆర్ఎస్‌కు ఏక కాలంలో సమాధానం చెప్పినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని ప్రజల్లో తమ ఆదరణ తగ్గలేదని, టీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఈ గెలుపు అవసరమని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో 2021 జాబితా ప్రకారం 2,16,983మంది ఓటర్లు ఉన్నారు.
Also Read:తిరుపతి ప్రజలు టీడీపీ వెంటే : విజయం నాదే అంటున్న పనబాక