19 Nominations Rejected in Huzurabad And 9 In Badvel
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికలు హోరాహోరీగానే సాగనున్నాయి. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా.. దాఖలైన నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. నామినేషన్ల పరిశీలన తర్వాత హుజూరాబాద్ బరిలో 42, బద్వేల్ బరిలో 18 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు తేల్చారు. నామినేషన్ల పరిశీలనలో హుజూరాబాద్‌లో 19 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా.. బద్వేల్‌లో 9 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం దాకా గడువు ఉండగా.. ఆ గడువు కూడా ముగిసిన తర్వాత బరిలో ఎందరు నిలుస్తారన్న విషయంపై క్లారిటీ వస్తుంది.
రాజేందర్ పేరుతో నలుగురు..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీజేపీలోనూ అమితాసక్తి రేకెత్తిస్తున్న హుజూరాబాద్ బైపోల్ లో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి దాదాపుగా బహిష్కరణకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని ఈటల వ్యూహాలు రచిస్తుండగా.. తనతోనే ఈటలకు ఈ మేర గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని నిరూపించాలంటే.. ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న కసితో టీఆర్ఎస్ సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటు టీఆర్ఎస్‌తో పాటు అటు ఈటలకు కూడా షాకిచ్చేందుకు రెండు పార్టీలు తమదైన శైలి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం చెల్లిన 42 నామినేషన్లలో రాజేందర్ పేరు కలిగిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. వీరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఒకరు కాగా.. ఆయన ఓట్లను దారి మళ్లించేందుకు మరో ముగ్గురు వ్యక్తులు ఇప్పలపల్లి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇమ్మడి రాజేందర్ బరిలోకి దిగారు. ఈ ముగ్గురిని టీఆర్ఎస్సే రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్కరు కూడా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధి గానీ, కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కాదట.
బద్వేల్ పోలింగూ రసవత్తరమే
ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన బద్వేల్ కు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. వైసీపీ తన అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధనే బరిలోకి దించగా.. చనిపోయిన నేత కుటుంబ సభ్యులనే బరిలోకి దించిన నేపథ్యంలో సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా టీడీపీతో పాటు జనసేన ప్రకటించాయి. అయితే ఈ సంప్రదాయంతో పని లేకుండానే బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయకున్నా.. తన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పనిచేయనున్నట్లుగా జనసేన ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా తన వంతుగా వైసీపీ మద్దతును తగ్గించేందుకు సిద్ధమైపోయింది. ఈ మూడు పార్టీల అభ్యర్థులు కాకుండా 15 మంది ఇతరులు బరిలోకి దిగారు. బద్వేల్ ఉప ఎన్నికకు మొత్తం 27 నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో 9 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇక పోటీలో 18 మంది అభ్యర్థులు మిగిలారు. వీరిలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారా? లేదా? అన్నది ఈ నెల 13న తేలిపోనుంది.
Must Read ;- ‘ఆత్మ సాక్షి’గా వైసీపీ గల్లంతే!











