Did KCR Go On A Delhi Tour Just To Solve The Problems Of The Rice Millers :
తెలంగాణ ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడో పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లుగా గడచిన కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకే ఆయన ఈ నెలలోనే వరుసగా రెండు సార్లు ఢిల్లీ టూర్లకు వెళ్లారని కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ సాగుతోంది. తనను తాను సేఫ్ జోన్ లోనే ఉంచుకునేందుకు పక్కా వ్యూహాలు రచించడంలో కేసీఆర్ ను మించిన వారు లేరనే చెప్పాలి. అయితే ఇప్పుడు తెలంగాణలోని రైస్ మిల్లర్లను చూసి కేసీఆర్ వణికిపోతున్నారట. మిల్లర్ల డిమాండ్లు తీరని పక్షంలో తన పదవికే ఎసరు వస్తుందని కూడా కేసీఆర్ తీవ్రంగానే భయాందోళనలకు గురవుతున్నారట. ఈ క్రమంలోనే ఈ నెలారంభంలోనే మూడు రోజుల ఢిల్లీ పర్యటనంటూ హస్తినలో ల్యాండైన కేసీఆర్.. ఏకంగా వారానికి పైగా అక్కడే తిష్ట వేశారు. అయితే అప్పుడు మిల్లర్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు అమిత్ షా నిర్వహించనున్న నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సును కారణంగా చూపుతూ మరోమారు కేసీఆర్ ఢిల్లీ ఫ్లైటెక్కినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు మిల్లర్ల సమస్య ఏంటి..?
తెలుగు రాష్ట్రాల్లో వరి పెద్ద ఎత్తున సాగు అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇటీవల కొత్త సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత వరి సాగు విస్తీర్ణం మరింతగా పెరిగింది. దీంతో వరి ఉత్పత్తి కూడా భారీగానే ఉంది. సాధారణంగా రైతులు పండించిన వరి మొత్తాన్ని ఏదో ఒకయ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది మాత్రం 60 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే సేకరించనున్నట్లుగా ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ మేర బియ్యం దేశ అవసరాలకు సరిపోతుందని, దీనిని మించి ఒక్క గింజ కూడా కొనేది లేదని కూడా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై అందరికంటే ముందుగా తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. తమ రాష్ట్రంలో భారీగా వరి సాగు అవుతోందని, అలాంటప్పుడు బియ్యం సేకరణకు పరిమితులు విధిస్తే.. తమ రైతులు పండించే వరిని ఏం చేయాలని కేసీఆర్ సర్కారు వాదిస్తోంది. మరోవైపు ఈ ప్రకటనను విన్నంతనే తెలంగాణలోని రైస్ మిల్లర్లందరూ కేసీఆర్ ను కలిశారట. కేంద్రం ప్రకటన తమకు తీరని అన్యాయం చేసేదేనని కూడా ఆందోళన వ్యక్తం చేశారట. తమకు న్యాయం జరగని పక్షంలో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ కూడా తెలంగాణ రైస్ మిల్లర్లు కేసీఆర్‌కు పరోక్షంగానే వార్నింగులు ఇచ్చినంత పనిచేశారట.
రైస్ మిల్లర్ల బలం ఏమిటంటే..?
తెలంగాణ వ్యాప్తంగా 3 వేల మంది రైస్ మిల్లర్లున్నారట. వీరంతా తమ ప్రాంతంలో మంచి రాజకీయ పట్టు కలిగిన వారేనట. అటు రైతుల నుంచి వరిని కొనుగోలు చేయడంతో పాటుగా ఇటు రైస్ మిల్లర్లలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారట. ఒక్కో రైస్ మిల్లుకు ఎంత లేదన్నా.. రూ.15 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుండగా.. ఆయా రైస్ మిల్లుల దినసరి ఖర్చే ఏకంగా రూ.1 లక్ష దాటుతోందట. ఇక ఈ మిల్లుల ద్వారా ప్రత్యక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా.. మరో 10 లక్షల మంది దాకా ఈ మిల్లుల ఆధారంగానే బతుకు బండి లాగిస్తున్నారట. అయితే కేంద్రం ప్రకటన అమలు అయితే.. వీటిలో మెజారిటీ మిల్లులు మూతపడక తప్పదు. ఇదే జరిగితే.. మెజారిటీ రైస్ మిల్లర్లు కూడా ఆందోళన బాట పట్టడం ఖాయమే. గ్రామాలత్లో.. ప్రత్యేకించి రైతులు, రైతు కూలీలతో నిత్యం సత్సంబంధాలను నెరపుతున్న రైస్ మిల్లర్లు ఆగ్రహిస్తే.. తన పదవికే ఎసరని కేసీఆర్ భావిస్తున్నారట. అంతేకాకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం భారీగానే పడే ప్రమాదాన్ని కూడా కేసీఆర్ గుర్తించారట. ఈ నేపథ్యంలోనే కేంద్రంతో మాట్లాడి ఎలాగైనా ఎఫ్‌సీఐ చేత తెలంగాణలో ఉత్పత్తి అయ్యే మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించేలా కేసీఆర్ మంత్రాంగం నెరపుతున్నారట.
Must Read ;- జగన్ మాటంటే.. కేసీఆర్ చేసేశారు