(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం ఘటనలో అరెస్టు చేసిన నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులకు జిల్లా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై జరిగిన చెప్పులు, రాళ్లదాడి ఘటనలో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రూరల్ పోలీసులు నెల్లిమర్ల మండలానికి చెందిన ఏడుగురు టిడిపి నాయకులను అరెస్టు చేశారు. వారిలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సువ్వాడ రవిశేఖర్ అస్వస్థతకు గురికావడంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మిగతావారిలో గొర్లెపేటకు చెందిన మహంతి శ్రీహరి, పిన్నింటి పాపునాయుడు, గొర్లి జగన్నాధం, సుంకరి నాగరాజు, సీతారామునిపేటకు చెందిన అట్టాడ పైడిరాజు, పూతికిపేటకు చెందిన శీర రామకృష్ణను జిల్లా కోర్టులో గురువారం సాయంత్రం పోలీసులు హాజరుపర్చగా వారికి జిల్లా న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారు.
సువ్వాడకు మరోమారు అస్వస్థత
అరెస్టు చేసిన టిడిపి నాయకులను పోలీసులు విజయనగరం జిల్లా కోర్టులో హాజరు పర్చగా, సువ్వాడ రవిశేఖర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని 108 వాహనంలో మళ్లీ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
అరెస్టులకు టీడీపీ నిరసన
టీడీపీ రాష్ట్ర మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును అదుపులోకి తీసుకోవడంతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఏడుగురు నాయకుల అరెస్టును జిల్లా టిడిపి నాయకులు ఖండించారు. అశోకగజపతి రాజు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, అదితి గజపతి రాజు, ఇతర నాయకులు అశోక్ బంగ్లా వద్ద నిరసన తెలిపారు. విజయనగరం పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు కిమిడి నాగార్జున, పలువురు నాయకులు విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి టిడిపి నాయకుల అరెస్టుపై ఆరా తీశారు.
రవిశేఖర్ కు అనిత పరామర్శ
విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న రవిశేఖర్‌ను రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు విజయనగరం నియోజకర్గ ఇన్‌ఛార్జి అదితిగజపతి, కరణం శివరామకృష్ణ తదితరులు పరామర్శించారు. వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొండపల్లి భాస్కర్ నాయుడు, వేమలి చైతన్య బాబు, అనురాధ బేగం తదితరులు ఉన్నారు.
భయాన్ని సృష్టించేందుకే ..
ఈ సందర్భంగా టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ భయాన్ని సృష్టించడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్వతంత్ర దేశంలో ఉన్నామా లేదా అన్న డౌట్ వస్తోందని ఎద్దేవా చేశారు. నేటివరకూ ఘటనా ప్రాంతాన్ని ట్రస్టు చైర్మన్ అయిన తనకు చూపించలేదని, 16 నెలలు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డికి మాత్రం చూపిస్తారని ఎద్దేవా చేశారు.
Also Read ;- అన్యాయాన్ని ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తారా ? : కళా
కళాకు సంఘీభావం
మాజీమంత్రి, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు కళా వెంకటరావును శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు కలిసి .. సంఘీభావం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన క్యాంపు కార్యాలయంలో విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతి, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి రాజు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ బొద్దల నరసింగరావు, కర్రోతు వెంకట నర్సింగరావు, గంటా పోలి నాయుడు, విజ్జపు ప్రసాద్, కంది మురళీనాయుడు, పూనమ్ చంద్ చౌదరి, కెంగువ శ్రీనివాసరావు, మైలపల్లి పైడిరాజు, కొట్యాడ వెంకటరమణ, రామోలు అప్పలనాయుడు, పాండ్రంకి గౌరీ సూరప్పడు, రాంబార్కి రాంబాబు, జోన్నవలస రాజేష్ తదితరులు కలిసి సంఘీభావం ప్రకటించారు.











