(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పాచిపెంట మండలం కంకణాపల్లిలో వారం రోజుల్లో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ, జిల్లా వైద్యాధికారి ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు ‘మేం ఏ పాపం చేశాం. వింత రోగంతో ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో తెలియడం లేదు.. ఒకరా.. ఇద్దరా.. వృద్ధులు, యువకులు అని తేడా లేకుండా వరుసగా పది మంది మరణించారు. మాకే ఎందుకీ శిక్ష అంటూ’ అధికారుల ముందు కన్నీరు పెట్టుకున్నారు. కేవలం 50 కుటుంబాలు మాత్రమే ఉన్న ఈ గ్రామంలో వరుస మరణాలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 17న మరణించిన రామకృష్ణ(21) పచ్చకామెర్లతో మృతి చెంది ఉంటాడని వైద్యులు నిర్ధారించగా.. మడ్డికల్లు, నాటుసారా, కలుషిత నీరుతోనే మరణాలు సంభవిస్తుండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.
దిగువశెంబిలో ..
సాలూరు మండలంలోని గంజాయిభద్ర పంచాయతీ దిగువశెంబిలోనూ వింత వ్యాధి విలయతాండవం చేస్తోంది. ఈ వ్యాధితో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. దిగువశెంబికి చెందిన అబ్రహం(4) కడుపునొప్పితో బాధపడుతూ మూడురోజుల క్రితం మృతి చెందాడు. ఈ నెల 9న గ్రామంలో వ్యాక్సినేషన్ వేసిన ఏఎన్‌ఎం బాలుడిని పరీక్షించారు. అప్పటికి ఆరోగ్యం బాగానే ఉందని ఆమె చెబుతున్నారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న తోణాం వైద్య సిబ్బంది ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఘటనపై వైద్యాధికారిణి సుజాత మాట్లాడుతూ.. బాలుడు మృతి చెందాడని తెలిసిన నేపథ్యంలో గ్రామంలో 42 మందికి వైద్య పరీక్షలు చేశామన్నారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. మలేరియా నివారణకు దోమతెరలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
కంటిమీద కునుకు లేకుండా ..
మన్యంలో వింత వ్యాధితో వరుస మరణాలు గిరిజనులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న గిరిజనులు మరణిస్తున్న విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. 2009లో పాచిపెంట మండలం చిల్లమామిడిలో వింత వ్యాధితో పదిమంది మృతి చెందగా, అదే గ్రామంలో 2020 నవంబరులోనూ వరుస మరణాలు సంభవించాయి. మెలియాకంచూరు పంచాయతీ ధూళిభద్రలోనూ వింత వ్యాధి గిరిజనుల ప్రాణాలను తీసేసింది. గతేడాది నవంబరులో చిల్లమామిడిలో ఒళ్లు పొంగులు, పచ్చకామెర్లు, తీవ్ర జ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అనంతరం అధికారులు గ్రామాన్ని సందర్శించి 147 మందికి వైద్య పరీక్షలు చేయించి విశాఖ కేజీహెచ్, నెల్లిమర్ల మిమ్స్‌కు తరలించారు. ఆ గ్రామంలో ప్రజలు తాగుతున్న నీటిని పరీక్షించారు. ఆహారం, మడ్డికల్లు నమూనాలు కూడా సేకరించారు. ఇంత వరకు కారణం ఏమిటి? ఎందుకు మరణించారో అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.
Must Read ;- పూళ్ల గ్రామంలో వింత వ్యాధితో వ్యక్తి మృతి ?
పునరావృతం కాకుండా..
మన్యంలో మరణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ గిరిజనులకు హామీ ఇచ్చారు. వైద్యులతో సమావేశం నిర్వహించామని, ప్రతి గ్రామంలోనూ నెలకోసారి వైద్య శిబిరం ఏర్పాటు చేసి గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించామని తెలిపారు. కంకణాపల్లిలో వారం పాటు వైద్య శిబిరాలు కొనసాగిస్తామన్నారు.
సాధారణ మరణాలే..
పాచిపెంట మండలం కంకణాపల్లిలో చోటు చేసుకున్నవి సాధారణ మరణాలేనని, ఎటువంటి వింత వ్యాధి లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్వీ రమణకుమారి స్పష్టం చేశారు. ఈ గ్రామంలో గత రెండు రోజుల్లో ఏడుగురు మరణించినట్లు వార్తలు వెలువడిన నేపధ్యంలో .. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు .. ఆమె గ్రామంలో పర్యటించారు. మరణించిన ఏడుగురులో నలుగురు 70 ఏళ్ళు పైబడి, వృద్ధాప్యం కారణంగానే మరణించారని తెలిపారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు కేన్సర్, మరొకరు కిడ్నీ సమస్య, ఇంకొకరు అతిగా మద్య పానం వల్ల చనిపోయారని, ఎటువంటి వింత వ్యాధి లేదని తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా, గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 114 మంది నుంచి రక్త నమూనాలు, త్రాగు నీటి శాంపిల్లు కూడా తీసుకుని, పరీక్షలకు పంపించామన్నారు. ఈ పర్యటనలో పార్వతీపురం అదనపు వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.