నితిన్ ఈ ఏడాది వరుస సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘భీష్మ‘ వంటి భారీ విజయం తరువాత అదే ఊపును కొనసాగించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘చెక్’ సినిమా ముస్తాబవుతోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రకుల్ – ప్రియా వారియర్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా సాగనుంది.
ఇక ఆ తరువాత సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రంగ్ దే‘ సినిమా ఉత్సాహ పడుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ జోడీగా కీర్తి సురేశ్ ఆకట్టుకోనుంది. ఈ సినిమా వచ్చేనెల 26వ తేదీన థియేటర్లకు రానుంది. నితిన్ – కీర్తి సురేశ్ జంటను తెరపై చూడటానికి అభిమానులంతా కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ తన 30వ సినిమాగా ‘అంధాదూన్’ రీమేక్ ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతూనే ఉన్నాయి.
ఆ మధ్య హిందీలో వచ్చిన ‘అంధాదూన్’ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు కథాకథనాల పరంగా వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమా రీమేక్ హక్కులను నితిన్ తీసుకుని, సొంత బ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా భారీఅందాల భామ నభా నటేశ్ నటిస్తుండగా .. కీలకమైన పాత్రల్లో తమన్నా .. రాధిక ఆప్టే కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ కి నిర్మాతలు ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొత్తానికి నితిన్ దూకుడు ఓ రేంజ్ లోనే ఉంది.
Must Read ;- ట్రైలర్ టాక్: నితిన్ ఎవరికి ‘చెక్’ పెడతాడో?











