టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. ఇక మహేష్ బాబు ఓ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పాడనే ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు ఇటీవల ‘భీష్మ’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల. ఈమధ్య కాలంలో వెంకీ సూపర్ స్టార్ మహేష్ ను కలిసి కథ వినిపించాడని టాక్ నడుస్తోంది.
గతంలో కూడా వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వెంకీ పవర్ ఫుల్ లైన్ ను మహేష్ కు వినిపించాడని, లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకొని రమ్మన్నాడని టాలీవుడ్ లో వార్తలొచ్చాయి. అప్పుడు దాన్ని రూమర్ గా కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు వెంకీ కథను పక్కాగా రెడీ చేసుకొని మహేష్ కు వినిపించాడని సమాచారం. మహేష్ కూడా వెంకీతో సినిమాకు సానుకూలంగానే ఉన్నాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే మహేష్ తన సొంత బ్యానర్ లోనే సినిమాను నిర్మించనున్నాడని సమాచారం.
దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టాడు. వెంకీ నాలుగోవ దర్శకుడు. మహేష్ ‘సర్కారు వారి పాట’ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో ఇంకా ఫైనల్ కాలేదు. అయితే మహేష్ తన తదుపరి సినిమాను మంచి కామెడీ ఎంటర్ టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆలోచన చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి వెంకీ – మహేష్ సినిమాపై వస్తున్న వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఒకే సినిమాలో పవర్ స్టార్, సూపర్ స్టార్.?











