బొత్స సత్యనారాయణ.. పేరుకు ఏదో వెనుకబడిన జిల్లా విజయనగరానికి చెందిన వారే అయినా రాజకీయ వ్యూహాల్లో ఆయన దిట్ట. తాను ఏ పార్టీలో ఉన్నా.. తనకు కావాల్సింది దక్కించుకోవడంలో ఏనాడూ ఆయన విఫలమైనదే లేదనే చెప్పాలి. ప్రత్యర్థులను తిప్పికొడుతూనే.. తన సొంత పార్టీలో అంతకంతకూ ఎదుగుతున్న బొత్స.. తన పార్టీ అధిష్ఠానానికి పెను ముప్పుగా పరిణమించడం ఖాయమేనన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నవే. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న బొత్స.. ఏపీ సీఎం జగన్ కేబినెట్ లో మునిసిపల్ శాఖ వంటి కీలక శాఖ మంత్రిగా ఉన్నారు. జగన్ సర్కారు ఏ కీలక నిర్ణయం తీసుకున్నా.. అందులో బొత్స పాత్ర కచ్చితంగా ఉండాల్సిందే. అసలు బొత్స లేకుండా కేబినెట్ సబ్ కమిటీలు అన్న మాటే వినిపించడం లేదు. ఇక తన సొంత జిల్లాపై బొత్సకు ఏ మేర పట్టుందో.. ఆయన రాజకీయ ప్రత్యర్థులే బాగా చెబుతారు. ప్రత్యర్థులే తన వ్యూహాలను కీర్తించేలా వ్యవహరించడం బొత్సకు మాత్రమే అబ్బిన విద్య అనే చెప్పాలి. ఇలాంటి నైజంతోనే బొత్స ఇప్పుడు సీఎం జగన్ కు పెను ముప్పుగా పరిణమించారన్న కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
టూర్లన్నీ సీక్రెట్టేనబ్బా
బొత్స సత్యనారాయణ చేపట్టే పర్యటనలన్నీ దాదాపుగా రహస్యమనే చెప్పాలి. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆయన మీడియాకు కనిపిస్తేనే ఆ జిల్లాలో బొత్స పర్యటిస్తున్నారని తెలుస్తుంది. అయితే మీడియా కంటబడకుండా బొత్స చాలా పర్యటనలు చేస్తున్నారట. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఇటీవల పలుమార్లు వెళ్లి వచ్చినా.. ఆ వివరాలేమీ బయటకు రాకుండా బొత్స చాలా చాకచక్యంగా వ్యవహరించారట. అయినా ఓ మంత్రిగా బొత్స ఢిల్లీ వెళ్లడం పెద్ద తప్పేమీ కాదు గానీ.. ఏకంగా తాను మంత్రిగా కొనసాగుతున్న కేబినెట్ కు హెడ్ గా ఉన్న సీఎం జగన్ కు కూడా ఈ వివరాలేమీ తెలియడం లేదట. తీరా ఢిల్లీ పర్యటనలను ముగించుకుని వచ్చాకే.. ఆ పర్యటనల గురించి బొత్స చెబుతారట. అంతేకాకుండా తన పర్సనల్ పని మీద ఢిల్లీ వెళ్లానని, అందుకే ఆ వివరాలేమీ ముందుగానే చెప్పడం లేదని కూడా బొత్స అలవోకగా కథను అల్లేస్తారట. ఈ తరహా పర్యటనలతోనే బొత్స అంటే.. జగన్ ఇప్పుడు తెగ భయపడిపోతున్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. అసలు బొత్స ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? అక్కడ ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు? సొంత పనుల పేరు చెబుతున్న బొత్స.. ఆ సొంత పనులేమిటో చెప్పకుండా వెంటవెంటనే ఢిల్లీకి వెళుతున్నారే? అన్న కోణంలో జగన్ తెగ ఇదైపోతున్నారట.
ఏదైనా బొత్స ఓకే అన్నాకే..
ఇక విజయనగరం జిల్లాలో ఇటు పార్టీ కార్యకలాపాలైనా, అటు ప్రభుత్వ కార్యకలాపాలైనా బొత్స అనుమతి లేకుండా జరిగే అవకాశమే లేదట. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై పట్టు సాధించిన బొత్స.. తనకు తెలియకుండా పార్టీ జిల్లా శాఖకు సంబంధించి పార్టీ అధినేతగా ఉన్న జగన్ సింగిల్ నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితి లేదంట. ఇలా నానాటికీ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ సాగుతున్న బొత్స ఎక్కడ తనకు థ్రెట్ గా మారతారోనన్న భయంతో.. గతంలోను బొత్సను రాజ్యసభకు పంపే దిశగా జగన్ పావులు కదిపారట. అయితే జిల్లాలోని తన పట్టుతో అది సాధ్యం కాకుండా బొత్స చాలా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారట. అయినా పార్టీ అధినేత నిర్ణయాలు కూడా అమలు కాకుండా బొత్స వ్యవహరిస్తున్నారంటే.. ఆయన ఏ మేర చక్రం తిప్పుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాను కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో తన పట్టును చూపించుకుని ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ తనకు ఏం కావాలన్నా సాధించుకునేందుకే బొత్స విజయనగరం జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేలా వ్యూహం రచించి సక్సెస్ సాధించారట. మరి అంతకంతకూ ఎదుగుతున్న బొత్స తనకు ఎక్కడ థ్రెట్ అవుతారోనని భయపడుతున్న జగన్.. బొత్సను ఎలా నియంత్రిస్తారో చూడాలి.
Must Read ;- నారా లోకేశ్ ను చూస్తుంటే జగన్ కు దడే











