ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జేమ్స్ బాండ్ చిత్రం ‘నో టైమ్ టు డై’ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్ లో ఇది 25 వ చిత్రం. జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రెగ్ కు ఆఖరి చిత్రం. దాదాపు 250 మిలియన్ల వ్యయంతో నిర్మించారని చెబుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఇందులో ఎలాంటి ఛేజింగ్స్ ఉన్నాయి? లాంటి విశేషాల గురించి తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
ఓ మహిళ హత్యతో కథ ప్రారంభమవుతుంది. హంతకుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కూతురు మేడ్లిన్ నీళ్లలో పడిపోతుంది. ఆ మేడ్లిన్ కీ జేమ్స్ బాండ్ కీ ఉన్న సంబంధం ఇందులో ఓ అంశం. జేమ్స్ బాండ్ ఉద్యోగం విరమించుకున్న తర్వాత జరిగే కథ ఇది. కొత్త జేమ్స్ బాండ్ నియామకం కూడా జరిగిపోతుంది. అతను ఉద్యోగం నుంచి రిటైరై ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో ఓ లేబొరేటరీలో శాస్త్రవేత్త కిడ్నాప్ నకు గురవుతాడు. ప్రాజెక్ట్ హెర్క్యూలెస్ పేరుతో ఆ ల్యాబ్ లో ఓ జీవాయుధాన్ని కనిపెట్టడమే ఈ కిడ్నాప్ నకు కారణం. ఆ జీవాయుధం దుర్మార్గుల చేతిలో పడకుండా ఉండాలంటే ఆ కిడ్నాపర్లను కనిపెట్టాలి. దాన్ని కనిపెట్టాలంటే బాండ్ అవసరం ఏర్పడుతుంది. ఎవరు ఈ కిడ్నాప్ చేశారు? దాన్ని జేమ్స్ బాండ్ ఎలా ఛేదించాడు అన్నదే ప్రధాన కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
బాండ్ సాహసాల గురించి మనకు తెలియంది కాదు. ఆకస్మిక దాడులు, వాటిని ఎదుర్కోవడం, ఛేజింగులు ప్రధానంగా ఈ సినిమాలో హైలైట్ అంశాలు. మెరుపు లాంటి కొన్ని సన్నివేశాలు తప్పితే సినిమాలో చెప్పుకోడానికి ఏమీ లేదు. నిడివి బాగా పెరిగిపోవడంతో కథనం సాగతీతలా అనిపిస్తుంది. ఇంత నిడివి లేకుండా ఉంటే సినిమా అలరించేదేమో. గతంలో కూడా నిడివి ఉన్న జేమ్స్ బాండ్ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా ది స్పై హు లవ్డ్ మి చిత్రం కూడా నిడివి బాగా ఎక్కువ. కానీ ఆ చిత్రం అసాధారణ విజయం సాధించింది. కథలో డ్రామా ఉన్నా అది సరిగా పండలేదు. ముఖ్యంగా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు భారంగా అనిపిస్తాయి.
ఇందులో విలన్ సాఫిన్ పాత్ర. దీన్ని రామి మాలెక్ పోషించాడు. బాండ్ గా డేనియల్ క్రెగ్ నటన బాగుంది. అలాగే రామిమాలెక్ నటన కూడా. పెద్ద హడావుడి లేని విలన్ పాత్ర ఇది. అతని అనుచరుల హడావుడే తప్ప ఈ పాత్ర హుందాగా కనిపిస్తుంది. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా ద్వితీయార్థంలోనే ఎక్కువ ఉన్నాయి. ఇంత పెద్ద జేమ్స్ బాండ్ సినిమాలో సాదాసీదా క్లైమాక్స్ లా అనిపిస్తుంది.
ముఖ్యంగా హీరో విలన్లు తలపడే సన్నేవేశాలు పేలవంగా ఉన్నాయి. నో టైమ్ టు డై అన్న టైటిల్ లోనే ఈ సినిమా ముగింపు దాగి ఉంది. అది ఏమిటన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాతో క్రెగ్ ఇక జేమ్స్ బాండ్ గా కనిపించడన్నది సుస్పష్టం. కొత్త జేమ్స్ బాండ్ పాత్ర కూడా ఇందులో ఉంది. ఈ సీక్వెల్ కొనసాగింపు ఇలాగే కొనసాగితే ఆమెను బాండ్ గా జనం ఊహించుకోలేరని మాత్రం చెప్పవచ్చు.
నటీనటులు: డేనియల్ క్రెగ్, రామి మాలెక్, లీ సైడెక్స్, బెస్ విస్ షా, నవోమి హారిస్, జెఫ్రీ రైట్, లాషాణా లించ్ తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం హన్స్ జిమ్మర్, ఎడిటింగ్ ఇల్లాట్ గ్రాహమ్, సినిమాటోగ్రఫీ లైనస్
దర్శకత్వం: క్యారీ జోజి పుకునాగా
విడుదల తేదీ: 30-09-2021
ఒక్కమాటలో: నో టైమ్ టు సీ
రేటింగ్: 2.5/5
– హేమసుందర్ పామర్తి
Must Read ;- చావడానికి సమయం లేదంటున్న జేమ్స్ బాండ్











