కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరగనున్నాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బెంగళూరులోని కన్నడ కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. పునీత్ రాజ్ కుమార్ మరణం దక్షిణ భారత చిత్ర పరిశ్రమను కలచివేసింది. ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమే కాకుండా తెలుగు, తమిళ చిత్ర ప్రముఖులు కూడా పునీత్ పార్థివదేహం వద్ద నివాళులర్పించేందుకు బెంగళూరుకు తరలి వెళ్లారు.
ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. నందమూరి బాలకృష్ణ అయితే పునీత్ పార్థివ దేహం వద్ద కళ్ల నీళ్ల పర్యంతమయ్యారు. ఆ భావోద్వేగంతోనే మీడియాతో మాట్లాడారు. ‘పునీత్ లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. పునీత్ మరణం వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. రాజ్‌కుమార్ కుటుంబంతో మాకు ఎంతో అనుబంధం ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేమంతా అన్నదమ్ములా ఉండేవాళ్లం. ఒక కళాకారుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఇంకో పక్క ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ మరణాన్ని చూస్తే దేవుడు అన్యాయం చేశాడనిపిస్తోంది.
నా ‘ఎన్టీఆర్’ సినిమా ప్రమోషన్‌కి కూడా పునీత్ వచ్చాడు. మంచి మనిషిగా పునీత్ ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితరులంతా బెంగళూరుకు తరలి వెళ్లారు. తనకు ప్రాణ మిత్రుడైన పునీత్ మరణ వార్త జూనియర్ ఎన్టీఆర్ ను కలచి వేసింది. తారక్ తో పునీత్ కు ఎంతో కాలంగా స్నేహం ఉంది. పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమా కోసం ఎన్టీఆర్ ‘గెలయా గెలయా’ అనే పాటను కూడా పాడారు. పునీత్ కుటుంబాన్ని వీరు పరామర్శించనున్నారు.
అంత్యక్రియలు సాయంత్రమే
పునీత్ అంత్యక్రియల విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. దానికి కారణం పునీత్ కుమార్తె వందిత అమెరికాలో ఉంది. ఆమె ఈ మధ్యాహ్నానికి బెంగళూరుకు చేరుకోనున్నట్లు సమాచారం అందింది. అందువల్ల ఈ సాయంత్రమే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున బెంగళూరుకు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Must Read ;- కన్నడే కాదు తెలుగు నేలా ‘పునీత’ మైంది











