ఏపీలో డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తే.. నోటీసులు, అక్రమ అరెస్ట్‌లతో ఏపీ పోలీసులు విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్న టీడీపీ వాదనలు నిజమేనని తేలిపోయాయి. విశాఖలో గంజాయి సాగును నిలువరించాలని డిమాండ్ చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేసిన తీరును విమర్శిస్తూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన వైసీపీ శ్రేణులు ఆయన ఇంటితో పాటు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, జిల్లాల కార్యాలయాలపై వరుసగా దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. పట్టాభి ఇంటిని చుట్టుముట్టి.. ఆయన ఇంటి తలుపులను బద్దలు కొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పట్టాభి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పట్టాభిని అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందనే కాకుండా.. అరెస్ట్ సందర్భంగా పోలీసులు కనీస నియమాలు కూడా పాటించలేదని ఆక్షేపించిన సంగతి తెలిసిందే.
ఏసీపీ, సీఐలపై బదిలీ వేటు
నేరుగా హైకోర్టే పట్టాభి అరెస్ట్ అక్రమమన్న రీతిలో అక్షింతలు వేసిన నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పట్టాభిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనలను పాటించలేదన్న కారణంగా ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజులను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఏసీపీని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించిన పోలీసు శాఖ.. సీఐని ఏలూరు రేంజి డీఐజీకి రిపోర్ట్ చేయాలని సూచించింది. పట్టాభి అరెస్టు సమయంలో ఇచ్చిన నోటీసులలో ఖాళీలున్నాయని, దీనిపై మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేసినందునే వారిపై పోలీసు శాఖ చర్యలు తీసుకుందని సమాచారం. ఇలా ఇద్దరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్న పోలీసు శాఖ.. పట్టాభి అరెస్ట్ సందర్భంగా నియమ నిబంధనలు అమలు కాలేదని ఒప్పుకున్నట్టైంది.
మిగిలిన వారిపై చర్యలేవి?
సాధారణంగా ఏ వ్యక్తికి అయినా నోటీసులు జారీ చేయాలంటే సమయం, సందర్భం కూడా చూసుకోవాలి కదా. అందులోనూ మాజీ మంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలకు నోటీసుల జారీ అంటే మరిన్ని మేర జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కదా. అయితే ఇవేవీ పట్టని విశాఖ పోలీసులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు అర్థరాత్రి వేళ నోటీసులు జారీ చేశారు. ఇలా అర్థరాత్రి వేళ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న భావనతోనే పట్టాభి పోలీసుల తీరుపైనా, జగన్ సర్కారు వ్యవహార సరళిపైనా నిప్పులు చెరిగారు. పట్టాభి అరెస్ట్ సందర్భంగా నిబంధనలు పాటించలేదన్న కారణంతో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసిన పోలీసు శాఖ.. అర్థరాత్రి వేళ ఆనందబాబుకు నోటీసులు జారీ చేసిన పోలీసులపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
Must Read ;- కుప్పంలో చంద్రబాబు.. జగన్‌కు సవాల్