అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా చేసిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప-ది రైజ్’. గత ఏడాది అలవైకుంఠపురములో చిత్రం తర్వాత బన్నీ చేసిన సినిమా ఇది. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల థియేటర్లలో శుక్రవారం విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని నిర్మించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఇది రూపొందింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోగలిగిందా? లేదా? అన్నది చూద్దాం.
కథలోకి వెళితే..
కృషి ఒక్కటే కాదు మనిషిలో కసి ఉన్నా జీవితంలో ఎంతవరకూ ఎదగగలడో చూపించే కథ ఇది. బాల్యంలో హృదయంలో నాటుకున్న భావజాలం అతని గుండెల్లో బడబాగ్నిని సృష్టిస్తే పుష్ప లాంటి వ్యక్తులే తయారవుతారు. ఇది 1995లో జరిగిన కథ. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం దుంగలు కొట్టే కూలీ పుష్పరాజ్ (అల్లు అర్జున్) తన తెగువతో స్మగ్లర్ గా ఎదుగుతాడు. ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ సామ్రాజ్యంలో పుష్ప ప్రభావాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి. పుష్పలోని తెగువను ఆసరా చేసుకుని కొండారెడ్డి (అజయ్ ఘోష్) కోట్లు సంపాదిస్తాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో మంగలం శ్రీను (సునీల్)ది ఓ సిండికేట్ వ్యవహారం. కొండారెడ్డి, మంగళం శ్రీను ఆగడాలకు పుష్ప ఎలా కళ్లెం వేస్తాడన్నది ఇందులో ప్రధాన అంశం.
అసలు పుష్ప ఎవరు? అతను ఇలా మారడానికి కారణం ఏమిటి? అతని జీవితంలో తల్లి ప్రేమ, ప్రియురాలి ప్రేమకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? లాంటి అంశాలతో ఇది తెరకెక్కింది. ఒకవిధంగా చెప్పాలంటే పుష్ప రాజ్ మొరటోడు. దేనికీ ఎక్కడా తగ్గడు. అతనిలో ఉండే మొండితనమే అతన్ని స్మగ్లర్ ని చేస్తుంది. అలాంటి మొరటోడు పాలు అమ్ముకునే శ్రీవల్లి (రష్మిక) ప్రేమలో పడతాడు. పుష్పరాజ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? శత్రువులను అతను ఎలా తుదిముట్టించాడు అన్న అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
మన దగ్గర దొరికే ఎర్ర చందనం ఎక్కడి దాకా వెళుతుంది అనే అంశం గురించి చెప్పాలి కాబట్టి దర్శకుడు కథను జపాన్ లో ప్రారంభించాడు. ఓ గిటర్ కొనుగోలు వ్యవహారంతో మొదలు పెట్టి శేషాచలం అడవుల్లోకి తీసుకు వెళతాడు. టైటిల్స్ లోనే దీని గురించి దర్శకుడు చెప్పాలనుకున్నాడు కాబట్టి కథని రివర్స్ స్క్రీన్ ప్లే లో నడుపుతూ హీరో ఇంట్రడక్షన్ చూపించాడు. అసలు మనం వచ్చింది పుష్ప సినిమాకేనా అన్న అనుమానంతో పాటు పొరపాటున పుష్ప తమిళ వెర్షన్ కు వచ్చేమేమో అన్న ఫీలింగ్ మొదట్లో కలుగుతుంది. కథలోకి వెళ్లాక హమ్మయ్య తెలుగు సినిమాకే వచ్చాం అనుకుంటాం. ఇలాంటి కథను ఎలా చెప్పాలో ఫుల్ క్లారిటీతోనే దర్శకుడు అడుగులు వేశాడు. అని సినిమా కథనంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది హైఓల్టేజ్ యాక్షన్ డ్రామా. పుష్పరాజ్ తన రెగ్యులర్ స్టయిల్ కు భిన్నంగా కనిపిస్తాడు. అందుకేనేమో ఐకాన్ స్టార్ అనే కొత్త పదం వచ్చి చేరింది. బన్నీని కొత్తగా చూపించాలన్న దర్శకుడి తాపత్రయం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక్కడ పుష్ప రాజే కనిపిస్తాడు తప్ప బన్నీ కనిపించడు. మేనరిజంలో, హావభావాల్లో తనదైన ప్రత్యేకతను చాటాడు. ఈ పాత్రలో ఆవేశం ఉంది, ప్రేమ ఉంది, ఉద్వేగం ఉంది. ఇక శ్రీవల్లి విషయానికి వస్తే అమాయకత్వంతో కూడిన చిలిపి పాత్ర. కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించే పాత్ర ఇది. ఇక డ్యాన్సుల్లోనూ ఆమె ఇరగదీసింది అనే ముఖ్యంగా సామి నా సామి పాటల్లో ఆమె డ్యాన్సింగ్ స్టయిల్ అందరినీ ఆకట్టుకుంటుంది.
సమంత ఐటమ్ సాంగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సునీల్ పోషించిన మంగలం శ్రీను పాత్రలోనూ ప్రత్యేకత ఉంది. పుష్ప రాజ్ మేనరిజంకు ధీటుగా శ్రీను మేనరిజం ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకుడి పాత్ర ఇది. అతని భార్య దాక్షాయణిగా అనసూయ నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ గురించి భారీ అంచనాలు పెట్టుకుంటే కష్టం. సినిమా చివరలో ఈ పాత్ర ప్రవేశిస్తుంది. బహుశా ఈ పాత్ర పరిధి పుష్ప 2లో ఎక్కువ ఉండొచ్చు. అనేక ప్రత్యేకమైన పాత్రలతో దర్శకుడు సుకుమార్ ఈ పుష్పను తీర్చిదిద్దారు.
తన దర్శకత్వ ప్రతిభ ఏ మాత్రమూ తగ్గలేదని నిరూపించాడు. క్యారెక్టరైజేషన్ మీదనే సుకుమార్ దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమాలోనూ అది కనిపించింది. సెంటిమెంట్ ను మాస్ ఎలిమెంట్ తో రంగరించి ఈ పుష్పను అందించారనే చెప్పాలి. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రీరికార్డింగ్ జీవం పోశాయి. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
ఇంత నిడివి ఉన్న సినిమాను తన నైపుణ్యంతో ఆసక్తికరంగా మలిచారు ఎడిటర్లు కార్తీక శ్రీనివాస్, రూబెన్. బన్నీ నుంచి కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఈ పుష్పలో ఉన్నాయి. చాలా మంది క్లైమాక్స్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఓ ఫైట్ తో సినిమా ముగుస్తుందని ఆశించారు. ఏ సినిమా చూసినా ఇది ఫలానా సినిమాలా ఉంది అనుకోవడం పొరపాటు. ఈ పాత్ర ఫలానా పాత్రలా ఉంది, ఫలానా సినిమా కథని ఇలా మార్చారు లాంటి కోడి గుడ్డుకు ఈకలు పీకే పనులు చేయకుండా సినిమాని సినిమాగా చూస్తే ఎలాంటి గొడవా ఉండదు.
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, సమంత, ఫాహద్ ఫాజిల్, అజయ్ ఘోష్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు.
సాంకేతిక వర్గం: సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: మీరోస్లా కూబా బ్రోజెక్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, రూబెన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్
విడుదల తేదీ: 17-12-2021
ఒక్క మాటలో: ఫైర్.. తగ్గేదే లే
రేటింగ్: 3.5/5
– హేమసుందర్ పామర్తి
Must Read ;- అఖండ (రివ్యూ)











