Aadhi Pinisetty As Villain In Ram Movie :
మంచి నటుడు అనిపించుకోవాలంటే ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి. ఈ విషయంలో ఆది పినిశెట్టిని అభినందించాల్సిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చినా అప్పుడప్పుడూ విలన్ గా మెరుపులు మెరిపిస్తున్నాడు. అల్లు అర్జున్ ‘సరైనోడు’లో ఎంతటి పవర్ ఫుల్ విలన్ గా చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ చాలా కాలం తర్వాత అలాంటి పాత్ర పోషించే అవకాశం వచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో విలన్ గా ఆదిపినిశెట్టి చేస్తున్నాడు. తనకు ఈ పాత్ర చేసే అవకాశం రావడం ఎంతో సంతోషం కలిగించిందని ఆది అంటున్నాడు.
ఇది సాధారణ విలనిజం కాదట.. చాలా డీటెయిలింగ్ తో ఈ విలన్ పాత్ర ఉంటుందని ఆది చెబుతున్నాడు. ఇందులో ఉప్పెన కథానాయిక కృతిశెట్టి నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ద్విభాషా చిత్రం కావడం వల్లే లింగు స్వామిని దర్శకుడిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విలన్ పాత్ర విషయానికి వస్తే కడప – కర్నులు ప్రాంతాలకు చెందిన రఫ్ పాత్ర ఇదని తెలుస్తోంది. తెలుగు ఈ తరహాలో సాగే ఈ పాత్ర తమిళం విషయానికి వచ్చేసరికి మధురై ప్రాంతపు వ్యక్తిగా కనిపిస్తుంది.
ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తున్న ఆది పినిశెట్టి సమాంతరంగా ఈ విలన్ పాత్ర ఎంచుకోడానికి కారణం ఈ పాత్రలో ఉండే విభిన్నమైన షేడ్ కారణమని అంటున్నారు. దర్శకుడు లింగు స్వామి జాతీయ అవార్డు గ్రహీత. అతను విలన్ పాత్రను చాలా బలంగా చూపించగలడు. ఈ కారణం వల్లే తను ఈ సినిమాను అంగీకరించానని ఆది పినిశెట్టి చెప్పారు. ‘యూటర్న్ నిర్మాతలతో నాకు ఇది రెండో సినిమా. రామ్ సినిమాలు చూశాను. అతనిలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఇలాంటి అరుదైన పాత్రలు చేయగలిగినప్పుడే నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఉంటుంది’ అని వివరించారు ఆది పినిశెట్టి.
Must Read ;- విజయ్ ఫ్లాష్ బ్యాక్ లో ‘ఫాస్ట్ ఫుడ్’ ఉద్యోగం!











