చింతమనేని ప్రభాకర్.. టీడీపీ నేతగా, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన నేత. అసలు దెందులూరు ఎమ్మెల్యేగా కంటే.. టీడీపీ నేతగా కంటే కూడాఏపరుతోనే చింతమనేని ప్రభాకర్ బాగా పాపులర్ అయ్యారు. తనదైన వ్యవహారంతో పలుమార్లు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీని కూడా ఆయన ఇరుకున పెట్టేశారని చెప్పాలి. అయితే పార్టీకి నమ్మిన బంటుగా, కరడుగట్టిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా చింతమనేని తనదైన శైలి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ పాలనలోనే చింతమనేనిపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయంటే.. ఆయన తీరు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా ఎవరికీ భయపడని నేతగా, అసలు భయమంటే ఏమిటో తెలియని నేతగా చింతమనేనికి గుర్తింపు ఉంది. అలాంటి చింతమనేని సోమవారం నాటి అరెస్ట్ సందర్భంగా గజగజా వణికిపోయారు. ఇదే తనకు చివరి రోజు అవుతుందేమోనని ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. భయానికే భయం పుట్టించే చింతమనేనిని ఏపీ పోలీసులు ఎంతగా భయపెట్టారో ఈ ఒక్క మాటే చెప్పేస్తోంది.
చింతమనేని భయం ఇలా..
విశాఖ జిల్లా నర్సీపట్నం అడవుల్లో పర్యటిస్తూ అలజడి సృష్టిస్తున్నారని, విచారిస్తే పొంతన లేని సమాధానం చెబుతూ పోలీసులనే తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలపై సోమవారం నాడు చింతమనేని ప్రభాకర్ అరెస్టైన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో అరెస్ట్ అయిన ఆయనను పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు పోలీస్ స్టేషన్ కు తరలించి నోటీసులు అందజేసి విడుదల చేశారు. ఈ క్రమంలో విశాఖ నుంచి అటవీ ప్రాంతంలో తనను తరలిస్తున్న సమయంలో పోలీసులు ఏ క్షణాన్నైనా తనను ఎన్ కౌంటర్ చేస్తారేమోనని చింతమనేని భయపడ్డారట. తాను భయపడ్డ తీరును స్వయంగా చింతమనేని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా చింతమనేని ఏమన్నారంటే.. ‘‘న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అన్యాయం చేస్తారా? రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. నర్సీపట్నం లో గంజాయి గురించి ప్రశ్నించి 151 నోటీసు ఇచ్చారు. ప్రశ్నించింది గంజాయి గురించి అయితే 151 నోటీసులో మాత్రం వేరేలా ఉంది. జగన్ మాత్రం తన కేసులపై డిశ్చార్జి పిటిషన్ వేస్తాడు. నా పై అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ కే నా కుటుంబం ఉంది నాకు కుటుంబం లేదా? నా అరెస్ట్ లో కుట్ర కోణం ఉంది. ఎస్పీ, కలెక్టర్ కి తెలియకుండానే నా అరెస్ట్ జరిగిందా? నర్సీపట్నం నుంచి నన్ను చింతపల్లికి తీసుకెళతామని పోలీసులు చెప్పారు. నాకు అదే చివరి క్షణం అని అనుకున్నా. ఆ దట్టమైన అడవుల్లో నన్ను కాల్చేసి, నక్సలైట్లు కాల్చేశారని చెపుతారేమోనని భావించా. నాకు నక్సల్స్ తో ప్రమాదం ఉందని చెపుతున్నారు. అది తప్పు నాకు ప్రమాదం నక్సల్స్ తో లేదు. పోలీసులతోనే నాకు ప్రమాదం’’ అని చింతమనేని చెప్పుకొచ్చారు.
ఈ భయం చెప్పేదేమిటంటే..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు, అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా పరిస్థితిపై ఎప్పటికప్పుడు టీడీపీ పోరాటం సాగిస్తూనే ఉంది. దాడులు, అరెస్టులు, కేసులతోనే సరిపెట్టని జగన్ పార్టీ ఏకంగా టీడీపీకి చెందిన క్రియాశీల కార్యకర్తలను కూడా పొట్టనబెట్టుకుంటున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి క్రమంలో ఇప్పటికే చింతమనేనిని పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు. అసలు వైసీపీకి టార్గెట్ గా మారిన టీడీపీ నేతల్లో ముందువరుసలో చింతమనేనే ఉన్నారు. ఆయననే పోలీసులు తొలుత అరెస్ట్ చేశారు. తాజా ఘటనలో అరెస్టైన సందర్భంగా చింతమనేని ఇంతగా భయపడిపోయారంటే.. జగన్ పాలన విపక్షాలను అంతమొందించే దిశగానే సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- టీడీపీకి దమ్ముంది.. మరి వైసీపీ మాటేంటో?











