తెలంగాణలో శుక్రవారం నిర్మల్ లో తెలంగాణ విమోచన దినం పేరిట బీజేపీ సభ జరిగితే.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గ కేంద్రం గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా పేరిట సభ నిర్వహించింది. ఈ రెండింటిలో కాంగ్రెస్ సభకే జనం భారీగా తరలివచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వెరసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పాలుపంచుకున్నప్పటికీ బీజేపీ సభ తేలిపోయిందనే చెప్పాలి. వాస్తవానికి బీజేపీ సభకు అమిత్ షా వస్తుంటే.. కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీని రప్పించేందుకు కాంగ్రెస్ నేతలు తమదైన శైలి యత్నాలు చేశారు. అయితే కారణం ఏమిటో తెలియదు గానీ.. ముందు కాంగ్రెస్ సభకు వస్తానంటూ రాహుల్ గాంధీ చెప్పినా.. ఆ తర్వాత ఆయన వెనక్కు తగ్గిపోయారు. అయితే రాహుల్ గాంధీ వచ్చి ఉంటే.. మాత్రం కాంగ్రెస్ పార్టీ సభ ముందు బీజేపీ సభ తేలిపోయేదేనని చెప్పాలి.
రేవంత్ వ్యూహం ఫలించింది
తెలంగాణలో ఎన్నికల వేడి ఓ రేంజికి చేరుకుంది. సాధారణ ఎన్నికలు కాకపోయినా.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికే ఈ వేడికి కారణంగా నిలుస్తోంది. హుజూరాబాద్ బరిలో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే పోటీ ఉందన్న వాదనలు వినిపిస్తున్నా.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంది. వెరసి అక్కడ ముక్కోణపు పోటీ తప్పదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రేవంత్ కు కీలక పదవితో కాంగ్రెస్ ఇటీవలి కాలంలో ఎన్నడూ కనిపించనంత జోష్ కనిపించింది. ఇదే హవాను ఇలాగే కొనసాగించేందుకే నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న రేవంత్.. దళిత, గిరిజన దండోరా పేరిట పలు ప్రాంతాల్లో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం దళిత, గిరిజన దండోరా ముగింపు సభను సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో నిర్వహించారు. ఈ సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు.
జనం లేకున్నా.. ఆకట్టుకుంది
ఇదిలా ఉంటే.. కేంద్ర హోం మంత్రిగానే కాకుండా బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అత్యంత కీలక నేతగా వ్యవహరిస్తున్న అమిత్ షా వస్తున్నారనగానే.. బీజేపీ రాష్ట్ర నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేసే దిశగా సాగారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల మీదే పార్టీ దృష్టి పెట్టడం, ఓ వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లు యాత్రలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి వెంట తిరగడమే పార్టీ కేడర్ కు తలకు మించిన భారంగా మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రంలోని కొన్ని ప్యాకెట్లలో బీజేపీకి బలమున్నా.. అన్ని ప్రాంతాల్లో అంతగా బలం లేదు కదా. ఈ కారణంగానే అమిత్ షా వస్తున్నారని తెలిసినా.. బీజేపీ సభకు పెద్దగా జనం రాలేదట. అయితే అమిత్ షా వచ్చిన నేపథ్యంలో మీడియా అంతా బీజేపీ సభపై దృష్టి సారించగా.. జనం భారీగా తరలివచ్చినా కాంగ్రెస్ పార్టీ సభను మీడియా అంతగా కవర్ చేయలేకపోయింది. దీంతో జనం కాంగ్రెస్ కంటే బీజేపీ సభనే హిట్ అయ్యిందని చాలా మంది భావించారు. అయితే బీజేపీ సభలో జనం పలుచగా కనిపించిన వైనంతో ఆ వాదన తప్పని తెలుసుకున్నారట.
Must Read ;- డబ్బులేసి, ఫ్రీజ్ చేసి.. ఇదేం ‘బంధు’?