తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన వైసీపీ శ్రేణులు.. వారిని అడ్డుకునేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి చేసి.. తమ పార్టీ జెండా కర్రలతో విరుచుకుపడిన తీరు ఏపీలో శుక్రవారం కలకలం రేపింది. ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పృహ తప్పి పడిపోగా.. వైసీపీ శ్రేణుల దాడిని పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంకా జనం మది నుంచి తొలగకముందే.. ఏకంగా రాష్ట్ర పోలీసు శాఖాధిపతి డీజీపీ కార్యాలయం వద్ద టీడీపీకి మరింత చేదు అనుభవం ఎదురైంది. డీజీపీని కలిసేందుకు యత్నించిన టీడీపీ నేతలను పోలీసులు డీజీపీ ఆఫీస్ గేటు బయటే నిలబెట్టేశారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన వైసీపీ కీలక నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మాత్రం లోపలికి అనుమతించి పోలీసులు తమదైన మార్కు పక్షపాతాన్ని బయటపెట్టుకున్నారు.
డీజీపీకి ఫిర్యాదు చేసేందుకే..
చంద్రబాబు ఇంటి వద్ద నెలకొన్న హైటెన్షన్ వాతావరణం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బుద్ధా వెంకన్న సమయానికి అక్కడ లేకపోతే.. చంద్రబాబుకు ఎలాంటి పరిస్థితి ఎదురయ్యేదోనన్న ఆందోళన వారిలో కనిపించింది. ఈ పరిస్థితిపై సమాలోచనలు జరిపిన టీడీపీ కీలక నేతలు.. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. పార్టీ నేత, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. టీడీపీ బృందాన్ని గేటు వద్దే నిలిపేశారు. తాము కేవలం డీజీపీకి ఫిర్యాదు చేసేందుకే వెళుతున్నామని, ఆందోళన చేయడానికి వెళ్లట్లేదని టీడీపీ నేతలు ఎంతగా చెప్పినా.. పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా పోలీసులతో నిమ్మల వాగ్వాదానికి దిగారు. తాను చట్టసభ సభ్యుడినని, తనను కూడా లోపలికి అనుమతించరా? అంటూ ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా పోలీసులు కనికరించలేదు.
అపాయింట్ మెంట్ లేకున్నా..
ఓ వైపు టీడీపీ నేతలు డీజీపీని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ తమను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం చేస్తున్న సమయంలోనే.. వైసీపీ కీలక నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడకు వచ్చారు. టీడీపీ నేతలకు కాస్తంత దూరంలోనే తన కారును ఆపిన ఆళ్ల నేరుగా డీజీపీ కార్యాలయంలోకి వెళ్లారు. ఇలా ఆయన వేరే గేటు ద్వారా కాకుండా.. పోలీసులు టీడీపీ నేతలను నిలువరించిన గేటుకు ఓ పక్కగానే లోపలికి ప్రవేశించారు. అంతేకాకుండా టీడీపీ నేతలు, వారు వ్యక్తం చేస్తున్న నిరసనలు తన చెవిన పడలేదన్నట్లుగా ఎంచక్కా ఆర్కే డీజీపీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. తమను అడ్డుకుని.. తమ పక్కగానే ఆర్కేను లోపలికి అనుమతించి వైనాన్ని చూసిన టీడీపీ నేతలు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను కూడా ఎమ్మెల్యేనేనండీ.. మీరు లోపలికి అనుమతించిన ఆళ్ల కూడా ఎమ్మెల్యే మాత్రమే. మరి నన్ను అడ్డుకుని.. ఆళ్లను ఎలా లోపలికి అనుమతించారరు’’అని నిమ్మల ప్రశ్నించినా పోలీసులు సమాధానమే ఇవ్వలేదు. టీడీపీ పట్ల పోలీసులు పక్షపాతపూరితంగానే వ్యవహరిస్తున్నట్లుగా ఉన్న ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- బాబు నామస్మరణకే కేబినెట్ భేటీ