ఆనందయ్య మందు పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఈ నెల ఏడవ తేదీ అంటే సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ ఉంటుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.అయితే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఆనందయ్య మందు తయారీకి కావాల్సిన వస్తువులను కూడా ప్రభుత్వం సమకూర్చలేదని తెలుస్తోంది. ఎవరూ కృష్ణపట్నం రావద్దని, జిల్లాలకే మందు పంపిస్తామని, ఆన్ లైన్ ద్వారా కూడా మందు సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. లక్షల మందికి మందు పంపిణీ చేయాలంటే తయారీకి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సి ఉంది. కానీ ఆనందయ్యకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆయన ప్రతినిధులు వెల్లడించారు. ఆనందయ్యకు కేవలం రోజుకు ఐదారు వేలకు మందికి మాత్రమే సరఫరా చేసే శక్తి ఉందని, లక్షల మందికి కావాలంటే మాత్రం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదని ఆనందయ్య ప్రతినిధులు తెలిపారు.
ఎవరూ కృష్ణపట్నం రావద్దు..
ఆనందయ్య మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని ప్రకటించారు.ఇప్పటికే కృష్ణపట్నంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించడం లేదు. కృష్ణపట్నంలో మందు సరఫరా చేయడం లేదని కూడా ఆనందయ్య తరపు ప్రతినిధులు వెల్లడించారు. ఆన్ లైన్‌లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మందు సరఫరా చేసేదే లేదని కూడా వారు ప్రకటించారు.
ఆనందయ్య చాలా బాధపడుతున్నారు
ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోవడం, వేలాది మంది ప్రతి రోజూ మందు కోసం ఫోన్లు చేస్తూ ఉండటంతో ఆనందయ్య చాలా బాధ పడుతున్నారని ఆయన ప్రతినిధి వెల్లడించారు.తమకు ప్రభుత్వ సహకారం లేదని వేలాది మందికి తాము మందు సరఫరా చేయలేమని వారు తెలిపారు. మందు కావాల్సిన ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే లక్షలాది మందికి అవసరమయిన మందు తయారు చేసి ఇవ్వడానికి ఆనందయ్య సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
Must Read ;- ఆనందయ్య మందు అమ్ముకోడానికి స్కెచ్ : చంద్రమోహన్ రెడ్డి










