బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కోసం ఓ యువతి హోమం చేయించడం, పూజలు చేయడం విశేషమే. ఆమె మరెవరో కాదు అంకితా లోఖండే. సుశాంత్ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె తన ఇంట్లోనే ఈ పూజలు నిర్వహించారు. గతంలో కూడా వీరిద్దరూ కలిసి పూజలు చేసిన వీడియోనూ కూడా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. టీవీ సీరియల్స్ చూసేవారికి అంకిత లోఖండే గురించి తెలియంది కాదు. అంకితకూ, సుశాంత్ కూ ఏమిటి సంబంధం అనే ప్రశ్న తలెత్తక మానదు. సుశాంత్ సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియల్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ‘పవిత్ర రిష్టా’ ఒకటి.

ఇందులో సుశాంత్ సరసన నటించింది అంకితానే. ఆ పరిచయం స్నేహంగా మారి ప్రణయంగానూ రూపుదాల్చింది. వీరిద్దరూ కలిసి దాదాపు ఆరేళ్లు సహజీవనం చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. 2016లో వీరిద్దరి బంధం తెగిపోయింది. పవిత్ర రిష్టా ముగిసి 12 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా అభిమానులతో తన విజయాన్ని జరుపుకుంది. సుశాంత్ లేకుండా పవిత్ర రిష్టా షో అసంపూర్ణంగా ఉందని, అతను మాత్రమే అర్చన మనసు దోచుకున్నవాడు అవుతాడని ఆమె వ్యాఖ్యానించింది. తర్వాత ఆమె షో నిర్మాత ఏక్తా కపూర్ కూ, తన సహనటులకూ కృతజ్ఞతలు తెలిపింది.

కుంగదీసిన సుశాంత్ మరణం
సుశాంత్ మరణం అంకితను కుంగదీసింది. అతని ఆకస్మిక మరణం తన మనసును కలచివేసిందని అప్పట్లో ప్రకటించింది. మళ్లీ ఇన్నాళ్లకు సుశాంత్ జ్ఞాపకాలతో సోషల్ మీడియాలో ఆమె కనిపించింది. సుశాంత్ మరణించి ఏడాది అయిన సందర్భంగా పూజలు చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ ప్రకారమే చేసింది. ‘నా జీవిత ప్రయాణంలో భాగమైనందుకు థాంక్యూ సుశాంత్.. మళ్లీ మనం కలుసుకుందాం’ అంటూ కామెంట్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
Must Read ;- సుశాంత్ సింగ్ ను తలచుకొని ఎంతో ఎమోషనల్ అయిన కృతీసనన్











