జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం చాలామంది చేస్తుంటారు .. ఆ లక్ష్యం దిశగా దూకుడుగా వెళ్లడం కొంతమందే చేస్తారు. కొంతమంది నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకు వెళితే .. మరికొంతమంది ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా పరుగులు పెడతారు. సాధ్యమైనంత త్వరగా తాడో పేడో తేల్చుకోవడమే సరైన పద్ధతి అనుకుంటారు. ఆశయాన్ని సాధించాలంటే ఆలోచనతో పాటు ఆవేశం కూడా కావాలి .. అప్పుడే విజయాన్ని తెచ్చుకోగలుగుతారు. ఆవేశం తొందరపాటుగా మారితే మాత్రం విషాదమైన ముగింపును ఇచ్చుకున్నవారవుతారు. ఆ జాబితాలో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఒకరు కావడం బాధాకరం.
సుశాంత్ సింగ్ పాట్నాలో జన్మించాడు .. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా పాట్నాలోను .. ఢిల్లీలోను సాగింది. చదువులో టాపర్ అవడంతో పాటు.. ఆటపాటల్లో చాలా యాక్టీవ్ గా ఉండేవాడు. ఆయనలో ఏదో ఆకర్షణ ఉండేది .. ఆయన కళ్లు సున్నితమైన హావభావాలను పలికించేవి. దాంతో స్నేహితులంతా ఆయన నటుడు అయితే బాగుంటుందని అనడంతో, సరదాగా ఆ దిశగా అడుగులు వేశాడు. అలా ఓ టీవీ సీరియల్లో అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత జీ టీవీలో ప్రసారమైన ‘పవిత్ర రిష్టా’ సీరియల్ ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది. ఈ సీరియల్ కారణంగా అమ్మాయిల్లో ఆయన క్రేజ్ బాగా పెరిగిపోయింది.
అలా టీవీ సీరియల్ ద్వారా క్రేజ్ తెచ్చుకుని వెండితెరపైకి వెళ్లినవారి జాబితాలో సుశాంత్ చేరిపోయాడు. 2013లో బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, చాలా తక్కువ కాలంలోనే అక్కడ కూడా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘ఎమ్.ఎస్. ధోని ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ఒక అనూహ్యమైన మలుపుగా మారింది. ఈ ఒక్క సినిమాతో ఆయన అక్కడ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. యూత్ లో ఆయనకి గల ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఆ తరువాత చేసిన సినిమాల్లో ‘కేదార్ నాథ్’ .. ‘ చిచోరే’ సినిమాలు ఆయనకి సూపర్ హిట్లను కట్టబెట్టాయి. చూస్తుండగానే ఆయన స్టార్ డమ్ .. పారితోషికం పెరిగిపోయాయి. యంగ్ హీరోలకు అక్కడ ఆయన గట్టిపోటీగా నిలిచాడు. భవిష్యత్తులో బాలీవుడ్లో బలంగా నిలదొక్కుకునే యువ హీరో ఆయనేననే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. అభిమానులు కూడా అదే అనుకున్నారు. కానీ సుశాంత్ మాత్రం సూసైడ్ తో తన పరుగుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తన అభిమానులకు ఎంతో ఆవేదనను మిగిల్చాడు.
సూర్యచంద్రులకే గ్రహణం తప్పడం లేదు .. సముద్రానికే ఆటుపోట్లు తప్పడం లేదు. కాలు తడవకుండా సముద్రం దాటగలంగానీ, కన్ను తడవకుండా జీవితమనే సాగరాన్ని దాటలేమని సుశాంత్ ఒక్కసారి ఆలోచన చేసుకుని ఉంటే, ఆయన కెరియర్ ఇంకా అందంగా ఉండేది .. ఆయన అభిమానులకు మరింత ఆనందంగా ఉండేది. జీవితంలో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ కలబడి .. నిలబడి .. గెలిచిన సుశాంత్, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం విషాదకరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితం విధి చేతిలో ఓడిపోయిన విజయం. ఈ రోజున ఆయన తొలి జయంతి .. ఈ సందర్భంగా ఆయనను ‘ది లియో న్యూస్’ స్మరించుకుంటోంది.
— పెద్దింటి గోపీకృష్ణ










