లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. నేడు పోలింగ్ డే కాబట్టి.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకూ ఆయన సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆయన రాజకీయాలకు కాస్తంత విరామం ఇస్తే.. తన సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ భావిస్తున్నాడు. అతడి దర్శకత్వంలో కమల్ ‘విక్రమ్’ అనే పాన్ ఇండియా క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన టీజర్ ఆ మధ్య విడుదలై.. అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఈ సినిమా షూటింగ్ కు కమల్ రాజకీయాల్లో బిజీ అవడం వల్ల అంతరాయం కలిగింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సైతం కమల్ ‘విక్రమ్’ మూవీ విడుదల కానుంది.
ఇక కమల్ ‘విక్రమ్’ మూవీకి సంబంధించిన ఓ సరికొత్త అప్టేడ్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో విలన్ గా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి ఇందులో విలన్ గా రాఘవ లారెన్స్ నటిస్తున్నట్టు నిన్న మొన్నటి వరకూ వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా నుంచి లారెన్స్ తప్పుకొని .. ఆయన ప్లేస్ లోకి విజయ్ సేతుపతి వచ్చి చేరారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ ఛద్దా, సుకుమార్ పుష్ప సినిమాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాఘవ లారెన్స్ ప్లేస్ లో విలన్ గా రాబోతుండడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. రీసెంట్ గా విజయ్ సేతుపతి తమిళ మాస్టర్ లోనూ, తెలుగు ఉప్పెనలోనూ విలన్ గా నటించి సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు కమల్ హాసన్ తో ఎంత పవర్ ఫుల్ గా ఢీకొడతాడో చూడాలి.