AP Deputy CM Narayana Swamy Wife Danced To The Bullet Bandi Song :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లోని మంత్రులకు నిజంగానే అదుపు లేదనే చెప్పాలి. ప్రజా ప్రతినిధిగా ఉన్న నేతలు కాస్తంత సంయమనంతో కూడా వ్యవహరించాలి. లేదంటే.. భారీ ఎత్తున విమర్శలతో పాటు సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ ను ఎదుర్కోక తప్పదు. మొన్నటికి మొన్న పర్సనల్ టూర్ అంటూ ఫ్రెండ్స్ తో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో రష్యాకు వెళుతూ.. తన లగ్జరీ లైఫ్ ను ప్రతిబింబించేలా సెల్ఫీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పెను వివాదాన్నే రేపారు. తాజాగా జగన్ కేబినెట్ లో ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తన పెళ్లి వేడుకల వీడియో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో బుక్కైపోయారు. ఈ వీడియోలో నారాయణ స్వామి ఎలాంటి హంగామా లేకుండా బుద్ధిగానే కూర్చున్నా.. ఆయన సతీమణి మాత్రం బుల్లెట్ బండి పాటకు చిందులేసి సంచలనం రేపారు.
భార్య డ్యాన్స్ ను ఆస్వాదిస్తూ..
నారాయణ స్వామి వివాహం చేసుకుని ఇప్పటికే 42 ఏళ్లు అవుతుందట. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామి చాలా కాలంగా రాజకీయాల్లోనే ఉన్నారు. ఎమ్మెల్యేగా, వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పలు కీలక పదవులు దక్కించుకున్న ఆయన తాజాగా డిప్యూటీ సీఎం అయిపోయారు. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ వంటి రెండు కీలక మంత్రిత్వ శాఖలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. వెరసి నారాయణస్వామి నిత్యం బిజీబిజీగానే ఉండాలి. అయితే ఎందుకనో గానీ.. చిత్తూరు జిల్లా దాటి ఆయన బయటకు వచ్చే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. కనీసం అమరావతిలోనూ తరచుగా కనిపించరు. తిరుపతిలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్న నారాయణస్వామి.. అక్కడే తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ క్రమంలో 42వ వివాహ వార్షికోత్సవాన్ని ఆయన ఇటీవలే తన ఇంటిలోనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే సాదాసీదాగా నిర్వహించుకున్నారు. అయితే ఆ వేడుకలో నారాయణస్వామి సతీమణి బుల్లెట్ బండి పాటకు మరో మహిళతో కలిసి స్టెప్పులు ఇరగదీశారు. ఈ సందర్భంగా తన భార్య డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను అలా ఆస్వాదిస్తూ నారాయణస్వామి కూర్చున్నారు. ఈ వీడియోను ఎవరు తీశారరో తెలియదు గానీ.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి వైరల్ గా మారిపోయింది.
లెక్కలేనన్ని వివాదాలు
నారాయణ స్వామిపై ఇప్పటికే లెక్కలేనన్ని వివాదాలు ఉన్నాయని చెప్పాలి. రెండు కీలక మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్న నారాయణస్వామి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని, భారీ ఎత్తున అక్రమ సంపాదన కూడబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు ఎవరు చేశారో తెలియదు గానీ.. వాటిని ఖండించేందుకు మీడియా ముందుకు తరచూ వస్తున్న నారాయణ స్వామి ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇక తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే క్రమంలో తనకంటే వయసులో చాలా చిన్నవాడైన సీఎం జగన్ కు పాదాభివందనం కూడా చేశారని కూడా ఆయనపై ఆరోపణలున్నాయి. ఇక తన సొంత జిల్లాకే చెందిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. అటు నుంచి తిరుగుటపాలో తనపై పడుతున్న విమర్శలను తట్టుకోలేక సతమతమైపోతున్నారు. ఇలాంటి తరుణంలో నారాయణ స్వామి భార్య డ్యాన్స్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారనే చెప్పాలి.
Must read ;- వివాదం రేపుకుని.. ఇతరులపై పడితే ఎలా?