ఏపీ సీఎం జగన్ మామ, గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన రష్యా టూర్ పై స్పందించి మరో కొత్త తరహా వివాదానాకి తెర తీశారు. తనది పర్సనల్ టూరేనని చెప్పుకున్న బాలినేని.. తన టూర్‌పై ఎందుకు రచ్చ చేస్తున్నారంటూ విపక్షం టీడీపీని ప్రశ్నించారు. అంతేకాకుండా తన రష్యా టూర్ లో టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్న కారణంగానే.. ఆ పార్టీ నోరు మూసుకుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా బాలినేని తన రష్యా టూర్, దానిపై రేగిన వివాదం తదితరాలను ప్రస్తావిస్తూ.. ఈ వివాదాన్ని అంతటితో ముగించకుండా మరింత వివాదం చేసేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బాలినేనిలా బాబు రచ్చ చేయలేదే
ఈ సందర్భంగా బాలినేని.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అంశాన్ని లేవనెత్తారు. చంద్రబాబు రెండు నెలల క్రితం మారిషస్ పర్యటనకు వెళ్లలేదా? అని బాలినేని ప్రశ్నించారు. వాస్తవంగా ఏ రంగానికి చెందిన ప్రముఖులు అయినా తమ పర్సనల్ టూర్ల గురించి బయటకేమీ చెప్పరు. సింపుల్ గా అలా వెళ్లి ఇలా వచ్చేస్తారు. ఒకవేళ బాలినేని చెప్పినట్లుగా చంద్రబాబు మారిషస్ పర్యటనకు వెళ్లి ఉంటే.. అది తన పర్సనల్ టూర్ కాబట్టే చంద్రబాబు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా.. ముందస్తు సమాచారం ఇస్తూ. మీడియాకు సమాచారం ఇస్తూ.. తన పర్యటనల్లో చోటుచేసుకున్న అంశాలను పూర్తిగా వివరిస్తూ సాగారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా లేరు. విపక్ష నేతగా మాత్రమే ఉన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి చంద్రబాబు టూర్లకేమీ వెళ్లరు కదా. అందుకే.. తన మారిషస్ టూర్ పర్సనల్ కాబట్టే.. చంద్రబాబు ఎవరికీ చెప్పకుండా.. పర్యటనలో బాలినేనిలా లగ్జరీ ఒలకబోస్తూ సెల్ఫీలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా.. అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చేసి ఉంటారు.
రచ్చ చేసింది బాలినేనే కదా
అయినా బాలినేని రష్యా టూర్ బాలినేని లగ్జరీ ఫొటో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతోనే బయటకు పొక్కింది. ఆ ఫొటోను వేరే ఎవరో కాకుండా స్వయంగా బాలినేనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ విషయాన్ని బాలినేనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. మరి తన పర్సనల్ టూర్ ను తానే బయటపెట్టుకుని.. తన పర్యటనను తానే వివాదం చేసుకున్నట్టే కదా. మరి బాలినేని స్వహస్తాలతో చేసుకున్న రచ్చకు వేరెవరో బాధ్యులు కాదు కదా. మరి వేరే ఎవరో తన రష్యా టూర్ ను రచ్చ చేశారని, వివాదం చేయాలని చూశారని బాలినేని బాధపడుతున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. తన పర్యటనను తానే రచ్చ చేసుకుని.. ఆ నిందను టీడీపీపై వేయాలని చూస్తున్న బాలినేని తీరుపైనా ఇప్పుడు ట్రోలింగ్ మొదలైపోయింది. బాధ్యత కలిగిన ఓ మంత్రిగా బాలినేని వెళ్లిన లగ్జరీ టూర్‌పై విపక్షాలు.. ప్రత్యేకించి వామపక్షాలు విమర్శిస్తే.. వారిపైనా బాలినేని విరుచుకుపడిన తీరు కూడా సరికాదు కదా. మరి ఈ విషయాలన్నీ బాలినేనికి ఎప్పుడు అర్థమవుతాయోనన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జగన్, సాయిరెడ్డిలకు ఊరట.. బెయిల్ రద్దు లేదు











