AP Speaker Tammineni Sitaram Controversial Comments Over Woman Assassination Played :
తమ్మినేని సీతారాం. ఏపీ శాసనసభాపతి. అంటే అసెంబ్లీ స్పీకర్. సభను నియమ నిబంధనల ప్రకారం నడిపే గురుతర బాధ్యతలు తీసుకున్న నేత. పూర్వాశ్రమంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ నేతాశ్రీ.. లేచించే లేడికి పరుగు అన్న చందంగా తనదైన సూక్తులు చెబుతూ వెళుతుంటారు. గతంలో అయితే ఫరవా లేదు అన్న రీతిన సాగినా.. ఇప్పుడు స్పీకర్ పదవిలో కూర్చున్నప్పటి నుంచి మాత్రం ఎందుకనో సారు గారి నాలికకు అసలు అంతూపొంతూ లేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి అధికారులపై పడిపోతారు. లేదంటే తన వద్దకు వచ్చిన ప్రజలపై పడిపోతారు. లేదంటే పిల్లలు కొత్త తరహా పాఠాలు నేర్చుకునేలా తనదైన కొత్త సూత్రాలను వల్లె వేస్తారు. సరే.. ఏది ఎలా ఉన్నా.. స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేనికి చట్టంలోని నిబంధనలు, చట్టాలు, వాటి అమలు.. తదితరాలపై ఇతరుల కంటే కాస్త పట్టున్నట్టే కదా.
వేదిక ఏదైనా తమ్మినేని వారంతే..
తన సొంత జిల్లా శ్రీకాకుళంలో శుక్రవారం నాడు జిల్లా పరిషత్ లో జిల్లా పోలీసు, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో దిశ యాప్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని.. దిశ యాప్ అమలు ఏ రీతిన ఉందో వివరించే యత్నం చేశారు. అంతేకాకుండా దిశ యాప్ ను తమ ప్రభుత్వం తీసుకొస్తే.. దాని అమలును కేంద్రం నిలిపేసిందన్న కోణంలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దిశ యాప్ కు కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదని అధికారులు వేచి చూడాల్సిన పని లేదని, అందుబాటులోని చట్టాలతోనే అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
AP Speaker Tammineni Sitaram :
లా అమలు ఇన్నేసి రకాలా?
ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని తనలోని ఓ రేంజి ఫ్లోను బయటపెట్టుకున్నారు. లా ను.. అదేనండి చట్టాలను ఎలా అమలు చేస్తే అత్యాచార బాధితులకు న్యాయం జరుగుతుందన్న విషయంపై తనదైన ఫ్లోతో ఫైరైపోయిన తమ్మినేని.. అవుటాఫ్ ది లా ను అమలు చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని సెలవిచ్చారు. స్త్రీలను అగౌరవపరచి వారిపై అత్యాచారాలకు పాల్పడే వారు ఈ భూమిపై ఉండటానికి వీల్లేదు. మీ చట్టాలు ఏం చేస్తాయో నాకు తెలీదు. అవుట్ అండ్ అవుట్ లా చేస్తారో, అవుట్ రైట్ లా చేస్తారో, అవుట్ ఆఫ్ ద లా లో వెళతారో.. మహిళలకు మాత్రం న్యాయం జరగాలి. సమాంతర న్యాయం ఇచ్చే శిక్షే కరెక్ట్ గా ఉంటుంది* అంటూ ఆయన తనదైన శైలిలో చెప్పుకుంటూ పోయారు. మరి అధికారులు అవుటాఫ్ ది లాలో వెళితే ఏమవుతుందన్న విషయం స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేనినికి తెలియదంటారా? అన్న కోణంలో ఆయనపై సెటైర్లు పడిపోతున్నాయి.
Must Read ;- కేంద్రంతో కుమ్మకై.. ప్రత్యేక హోదాను గాలికొదిలేశారు!
Must Read : స్పీకర్ ఓకే అంటేనే వేటు.. కోర్టుల జోక్యం లేదంతే