సంక్షేమ పథకాలకు పైసలను పంచుతున్న ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం ప్రతి నెల తిప్పలు పడుతోంది. సంక్షేమ పథకాలకు అందినకాడికి అప్పులు చేస్తుండటంతో కేంద్రం ఏపీ రుణ పరిమితులపై ఆంక్షలు విధిస్తోంది. ఏపీ రుణ పరిమితిని పెంచాలని సీఎం జగన్ కోరినా కేంద్రం కరుణించలేదు. కరోనా సందర్భంగా గత ఏడాది కొన్ని షరతులతో రుణ పరిమితిని పెంచగా ఈ ఏడాది దానిని కొనసాగించే పరిస్ధితులు లేవు. వైసీపీ సర్కార్ చేస్తున్న అప్పులతో రాష్ట్ర ఖజానా పరిస్ధితి ఇప్పటికే దారుణంగా తయారైంది. ఈ పరిస్ధితుల్లో కొత్తగా రూపాయి కూడా అప్పు పుట్టే పరిస్ధితులు కనిపించడం లేదు. ఏదో రకంగా ఎక్కడో చోట రుణం తెచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం తంటాలు పడుతున్నా కేంద్రం అడ్డుపుల్లలతో ఇబ్బందులు కలుతున్నాయి.
రూ.4 లక్షల కోట్లకు చేరుతున్న అప్పులు
ప్రతి పక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని టీడీపీపై విమర్శలు చేసిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి మరిన్ని అప్పులు చేస్తోంది. ఇప్పటికే ఏపీ అప్పులు దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరబోతున్నాయన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం తాజాగా ఏపీ రుణ పరిమితుల్లో భారీగా కోతలు విధించింది. దీంతో కొత్తగా అదనపు రుణాలు సేకరించేందుకు కూడా వీలు కలుగటం లేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ రుణ పరిమితిని రూ.42,742 కోట్లకు పెంచాలని కేంద్రాన్ని ఇప్పటికే జగన్ అభ్యర్ధించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయి ఈ విషయమై అభ్యర్థించినా కేంద్రం కరుణించలేదు. ఇప్పటికే ఏపీ భారీ ఎత్తున అప్పులు చేస్తుండటం, కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్, ఇతర సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాలతో రుణ పరిమితిని పెంచలేమని కేంద్రం తేల్చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కేంద్రం అనుమతించిన మేరకే రుణాలు తీసుకోక తప్పదు.
రుణ పరిమితిలో భారీగా కోత
ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితిని రూ.42,742 కోట్లకు పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరినా కేంద్రం రూ.37,163 కోట్లకే పరిమితం చేసింది. ఆ తర్వాత పరిమితిలో కోతతో రూ.32,669 కోట్లకు తగ్గించింది. తాజాగా మరోసారి దాన్ని ఇంకా తగ్గించి రూ.27,669 కోట్ల మేరకు అనుమతులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించి రాష్ట్రానికి షాకిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ మొత్తానికి పరిమితం కావాల్సిందే. కేంద్రంతో వైసీపీ సర్కారు సత్సంబంధాలు కొనసాగిస్తున్నా రుణ పరిమితుల విషయంలో మాత్రం కేంద్రం ఎలాంటి కనికరం చూపడం లేదు.
సంస్కరణలు అమలు చేస్తేనే..
గతంలో ఆమోదించిన రుణ పరిమితుల మేరకు కూడా ఏపీ అప్పులు తెచ్చుకునేందుకు నిరాకరిస్తున్న కేంద్రం తాజాగా కొత్త పల్లవి అందుకుంది. సంస్కరణలు అమలు చేస్తేనే కొత్త రుణాలకు ఆమోదం తెలుపుతామంటూ షరతులు పెడుతోంది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే రూ.5800 కోట్ల మేర రుణాలకు అనుమతులిస్తామంటోంది. సంస్కరణల్లో భాగంగా అదనపు రుణం పొందటానికి డిస్కంలను ప్రైవేటీకరించాలని షరతు పెడుతోంది. డిస్కంలు ప్రైవేటీకరిస్తే ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదని ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- ముందు అప్పు చేయ్.. తర్వాత తప్పు చేయ్