( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. వాస్తవానికి బుధవారం నుంచి టీడీపీ ఆధ్వర్యంలో గాజువాక పార్టీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటున్నాయని, ఈ విషయంలో ఉద్యమించకుంటే ప్రైవేటీకరణ ఆగదని భావించి ఆమరణ దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తుది శ్వాస ఉన్నంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తో పాటు అన్ని పరిశ్రమలకు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉద్యమంలో వెంట నడుస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు శుక్రవారం నుంచి ట్రేడ్ యూనియన్ నాయకులు కూర్మన్నపాలెం లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యేలా కనిపిస్తున్నాయి.
ఎక్కడికక్కడ సమావేశాలు.. దీక్షా శిబిరాలు..
విశాఖలో ఉక్కు ఉద్యమం మరో స్థాయికి చేరుతోంది. మొన్నటి వరకు నిరసన లకే పరిమితమైన ఆందోళన కార్యక్రమాలు నిరాహార దీక్షల వైపు టర్న్ తీసుకున్నాయి. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఆందోళన కార్యక్రమాలు బైక్ ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించే స్థితికి చేరాయి. టిడిపి ఆధ్వర్యంలో గాజువాక పల్లా శ్రీనివాసరావు ఈ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం టిడిపి కి పోటీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం నుంచి స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకుల నేతృత్వంలో భారీ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నారు. ఈ దీక్షలు ప్రజానీకం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు నగరంలో అనేకచోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు, జేఏసీ సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయి. మేధావులు, విద్యార్థులు , మహిళలు ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు.
దీక్ష భగ్నం చేసే అవకాశం..
పల్లా శ్రీనివాస్ చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి లేదు. మరో వైపు ఆయన ఆరోగ్య పరిస్థితి పై పోలీసులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆరోగ్యం ఏ మాత్రం క్షీణించినట్టు వైద్యపరీక్షల్లో తేలినా వెంటనే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయన దీక్షకు ప్రజల నుంచి స్పందన పెరిగినా దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
నిర్వాసితుల అనేక సమస్యలు పరిష్కారం..
గాజువాక ఎమ్మెల్యే గా పనిచేసిన కాలంలో పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించిన అనేక సమస్యలపై పోరాటం చేశారు. ఆర్ కార్డుల బదిలీలో అనేక సవరణలు చేయించగలిగారు. ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తరువాత తరం వారసులకు ఆర్ కార్డులు వర్తింపజేసి నిర్వాసితులకు మేలు చేశారు. ఈ నిరవధిక నిరాహార దీక్షతో విశాఖ ప్రజలకు మరింత చేరువయ్యారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన ఉన్న పల్లా శ్రీనివాసరావు ప్రైవేటీకరణ ను అడ్డుకుని తీరుతాం అని స్పష్టం చేశారు.
Must Read ;- స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆన్ లైన్ పిటీషన్