తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచాలని పలుమార్లు హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం సమర్పించిన డేటాపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ది హిందూ, ఆంధ్రజ్యోతి పత్రికలు సంచలన కథనాన్ని వెలువరించాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాల మేరకు హైదరాబాద్‌లో అంతకుముందు ఏడాదితో పోల్చితే 2020 ఏప్రిల్ నుంచి మొత్తం మరణాల సంఖ్య పదిరెట్లు పెరిగిందని, ఇందుకు డెత్ సర్టిఫికెట్ల జారీ సంఖ్య ప్రామాణికమని సదరు వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే ఈ మరణాల్లో కొవిడ్ మరణాలెన్ని అనే అంశం మాత్రం వెల్లడి కాలేదు.
సమాచార హక్కు ద్వారా సేకరణ
2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు హైదరాబాద్‌లో (జీహెచ్ఎంసీ పరిధిలో) కొవిడ్ మరణాలు 3,272 జరిగాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే 2020 ఏప్రిల్ నుంచి 2021మే వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో జారీ అయిన మరణ ధ్రువీకరణ పత్రాల సంఖ్య అమాంతం పెరిగిందని, ఈ కాలంలోనే 32,752 డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తేలింది. ఓ స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు ద్వారా ఈ వివరాలు సేకరించింది. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు జారీ అయిన మరణ ధ్రువీకరణ పత్రాల సంఖ్య 18,420 ఉండగా, 2021 జనవరి నుంచి మే వరకు 14,332 మరణ ద్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. అంతేకాదు 2016 నుంచి 2019 వరకు మూడేళ్లలో జారీ అయిన మరణ ధ్రువపత్రాల సంఖ్య 21,709 కాగా, 2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు అంటే 13నెలల వ్యవధిలోనే 32,752 పత్రాలు జారీ అయినట్టు తేలింది. అదే సమయంలో హిందూ పత్రిక కొల్‌కత, చెన్నైల్లో జారీ అయిన మరణ ధ్రువపత్రాల సంఖ్యను పరిశీలిస్తే అంతకు ముందు కాలంతో పోల్చితే ఈ నగరాల్లో మరణాలు వరుసగా 4.5, 3.3 రెట్లు పెరిగాయని కథనంలో రాసింది.
Also Read ;- మాస్క్ యుగం@1918 : సేమ్ ట్రాజెడీ
కారణాలపై సందేహాలు..
మరణాల సంఖ్యపై విశ్లేషిస్తే పలు అనుమాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఆ మరణాలకు కారణం ఏంటనేది మాత్రం వెల్లడయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం జారీ చేసే మరణ ధ్రువీకరణ పత్రాల్లో మరణానికి గల కారణాలను పేర్కొనరు కాబట్టి ఆ మరణాల్లో కొవిడ్ మరణాలెన్ని అనే అంశంపై స్పష్టత లేదు. ఈ 32,752 మరణాల్లో కొవిడ్ మరణాలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు,ఘటనలు అన్నీ కలిపి ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా 2016 నుంచి 2019 మధ్య కాలంతో నమోదైన మరణాల సంఖ్య కంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 మేరకు అంటే కేవలం 13నెలల్లో నమోదైన మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడంపైనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో డేటా ప్రకారమే ఇన్ని మరణాలు సంభవించాయని, తెలంగాణ మొత్తం పరిశీలిస్తే ఇంకా ఎక్కువ ఉంటుందని కథనంలో పేర్కొన్నారు. ఇక సదరు పత్రిక రాసిన కథనం ప్రకారం 2016 నుంచి 2021 వరకు చెప్పిన వివరాల ప్రకారం 2020, 2021లోనే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఏటా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తున్నా 2020 ఏప్రిల్ నుంచి 2021 మే నెల వరకు మరణాలు అమాతం పెరిగినట్టు స్పష్టం అవుతోంది.
Must Read ;- రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు..











