సినిమా పడవ మునిగిపోతోందా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరోనా కారణంగా సినిమా రంగానికి ఎంత నష్టం వాటిల్లి ఉంటుందన్నది అంచనా కట్టడం అసాధ్యమే.
మనీ ఫ్లో ఉంటేనే మనుగడ సాగే రంగం సినిమా రంగం. అందరూ చేతిలో డబ్బులు పుష్కలంగా ఉండి సినిమాలు తీసే వారు కాదు. కొందరు ఫ్యాషన్ కోసం వచ్చి సినిమాలు నిర్మిస్తారు, మరికొందరు వేరే ప్రయోజనాల కోసం సినిమాలు నిర్మిస్తారు. ఓ స్టార్ హీరో కాల్షీట్లు ఇస్తే ఫైనాన్సర్లు అప్పివ్వడానికి ముందుకు వస్తారు. చిన్న హీరోల సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు పెద్ద హీరోలూ లేరు.. చిన్న హీరోలూ లేరు.. దాదాపు ఏడాదిన్నర కాలం చిత్ర రంగం స్తంభించి పోయింది.
గత జనవరిలో థియేటర్లు ప్రారంభమైన తర్వాత నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో గట్టెక్కిన నిర్మాతలు ఒకరిద్దరే నంటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికి క్రాక్, ఉప్పెన. నాంది తప్ప మరే సినిమా కూడా కమర్షియల్ గా అంత పెద్ద హిట్ కాలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘వకీల్ సాబ్’ ఇంత వసూలు చేసింది.. అంత వసూలు చేసింది అన్న మాటలేగానీ అసలు లెక్కలు బయటికి వచ్చాక డొక్క పగిలే నిజాలు తెలిశాయి. నిర్మాతకు బొక్క పడేలానే ఈ సినిమా వసూళ్లు ఉన్నాయి.
ప్లాన్ లేని పానిండియా సినిమాలు
పాన్ ఇండియా పేరుతో ప్రారంభమైన సినిమాల పరిస్థితి అయోమయంగానే తయారైంది. బాహుబలిని చూసి అందరూ ఈ పేరుతో భారీ బడ్జెట్ చిత్రాలకు తెర తీశారు. ఇదే ఇప్పుడు కొంప ముంచుతోంది. అసలు సినిమాల షూటింగులు పూర్తయ్యేది ఎప్పుడు?, విడుదలయ్యేది ఎప్పుడు? అన్నది చెప్పడం కూడా కష్టమే. పైగా ఇలాంటి సినిమాలకు ఒకే ఇన్వెస్టర్ ఉండరు.. రకరకాల భాషల నిర్మాణ సంస్థలు చేతులు కలిపితేనే పాన్ ఇండియా సినిమా లక్ష్యం నెరవేరుతుంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, పుష్ప, సర్కారు వారి పాట, ఆచార్య, లైగర్, నారప్ప, సలార్, ఆదిపురుష్.. సినిమాల జాబితా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే తయారవుతుంది.
ఇలాంటి సినిమాలకు ఫైనాన్స్ చేసిన వారు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సినిమా వడ్డీలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడు రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీ దాకా తెచ్చి సినిమాలు ప్రారంభిస్తారు. సాధారణ సినిమా అయితే నాలుగు నెలల్లో విడుదలై జనం ముందుకు వచ్చేస్తుంది. అదే పాన్ ఇండియా సినిమా అయితే రెండు మూడేళ్లకు గానీ జనం ముందుకు రావడం లేదు. ఇప్పుడు కరోనా కారణంగా అసలుకే మోసం వచ్చింది. సినిమాల నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. నిర్మాతలకు వడ్డీలు భారంగా మారాయి. హీరోలంతా చకచకా కొత్త సినిమాలు ప్రకటించేశారుగానీ వీటికి ఫైనాన్స్ పుట్టడం కూడా కష్టంగానే ఉంది.
Must Read ;- థియేటర్లు తెరిచినా మళ్లీ అదే సస్పెన్స్
ఊబిలో చిత్ర నిర్మాతలు
ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా రంగం యావత్తూ సంక్షోభంలో కూరుకుపోయింది. మేకపోతు గాంభీర్యంతో నిర్మాతలు ఉన్నారు. వారి అంతరాంతరాల్లోకి తొంగి చూస్తేగానీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. ఎలాగోలా సినిమా పూర్తి చేసి విడుదల చేసినా థియేటర్లకు జనం రావడం లేదు. ఆ కలెక్షన్లు చూశాక గానీ తాము అప్పుల ఊబిలో కూరుకుపోయామన్న నగ్నసత్యం ఆ నిర్మాతలకు బోధపడటం లేదు. కరోనా వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోవడం. వడ్డీల భారంగా మారడం, సెట్స్ పరంగా నష్టం, వసూళ్లు సరిగా లేకపోవడం లాంటి కారణాలన్నీ నిర్మాతలు కుదేలైపోవడానికి ప్రధాన కారణం.
ఈ పరిస్థితి నుంచి నిర్మాతలు గట్టెక్కాలంటే హీరోలు పెద్ద మనసు చేసుకోవలసిందే. తమ రెమ్యూనరేషన్లను భారీగా తగ్గించుకుంటే తప్ప వీరు బయటపడటం సాధ్యం కాదు. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు ఇంతకాలం వరకూ షూటింగ్ పూర్తికాకుంటే హీరోల రూపురేఖలు పూర్తిగా మారిపోవడం పరిపాటి. ఆ ఫిజిక్ కంటిన్యుటీ దెబ్బతింటుంది. ఆ విషయంలో హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందులో మూడు రకాల మెగాస్టార్లు కనిపిస్తారు. ఇప్పటికిప్పుడు షూటింగులు ప్రారంభమైనా జూనియర్ ఆర్టిస్టులు దొరకడం కష్టం. చాలామంది నటీనటులు, టెక్నిషియన్లు సిటీ ఖర్చులు భరించలేక, ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం నిదానంగా షూటింగులు ప్రారంభమవుతున్నాయి. మరో పక్క కోవిడ్ థర్డ్ వేవ్ భయం ఉండనే ఉంది. అదే జరిగితే ఒక్క సినీ పరిశ్రమే కాదు అన్ని రంగాలు కుదేలవుతాయి. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారడం కూడా ఖాయం. సినిమా థియేటర్లు ప్రారంభమైనా జనం సినిమాలు చూడటానికి వస్తారా? అన్న సందేహం కూడా ఉంది. ఎందుకంటే జనం ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు. ఇంకో పక్క ఆర్థికంగా బాగా చితికి పోయారు. మల్టీప్లెక్స్ లలో వేలకు వేలు పోసి సినిమాలు చూసే పరిస్థితి లేదు. సినిమా పడవ మునిగిపోతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.
– హేమసుందర్
Must Read ;- లైగర్ కు 200 కోట్ల ఓటీటీ ఆఫర్. విజయ్ ఏమన్నాడో తెలుసా.?