తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పనితీరు మీద ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ లేపాక్షి మండలంలో మాట్లాడుతూ.. రాష్టంలో అర్థంకాని పరిస్థితిని మనం చూస్తున్నామని హిందూ ఆలయాలపై దాడులకు సంబధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ ఆలయంలో నాలుగు సింహాలలో మూడు సింహాలు మాయం చేశారని, అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామివారి రథాన్ని తగలబెట్టారని, రామతీర్థంలో రాములవారి తల తీసేశారని.. హిందువులను, భక్తులను నానా విదాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాలకృష్ణ అన్నారు.
ఎవ్వరికీ భయపడేది లేదు.. ఎన్టీ రామరావుగారు మనకిచ్చిన వారసత్వం మన తెలుగు పౌరుషం ప్రపంచానికి తెలిసేలా.. ప్రతి ఒక్కరమూ తిరగబడదాం.. మనమాటలను వినకపోతే మన సూచనలను తీసుకోని మారకపోతే తప్పకుండా తిరగబడదాం అంటూ ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు.
రైతులంటే ఎమిటో ఇవాళ ఢిల్లీలో చూస్తున్నామని, కేంద్రాన్ని గజ గజ వణికిపోయేలా చేస్తున్నారని బాలయ్య అన్నారు. మన సూచనలకు వారు (ప్రభుత్వం) స్పందించక పోతే రోడ్డెక్కుదాం ఉద్యమం చేద్దాం అని పిలుపు ఇచ్చారు.
మేము సూచనలు సలహాలు ఇస్తాము- ఈ ప్రభుత్వం తీసుకోదు. చెప్పినా వినరు కనరు అని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్పినా వినబడదు కన్నుమిన్నూ కనబడదు చెవిటి మూగ ప్రభుత్వం అంటూ నిశితంగా విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో పాలన.. కనకపు సింహాసనం పై శునకం కూర్చోబెట్టినట్టు ఉందని- బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
బాలయ్య అంత నిశితంగా కనకపు సింహాసనమున అంటూ విమర్శించినది ఎవరిని? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలవుతోంది. ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డే గనుక.. అధికార సింహాసనాన్ని అధిష్టించి ఉన్నది ఆయనే గనుక.. ఈ వ్యాఖ్యలు కూడా ఆయనను ఉద్దేశించే అయి ఉండొచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.
Must Read ;- నానీ నోరు అదుపులో పెట్టుకో, లేదంటే చేతల్లో చూపిస్తాం: బాలయ్య