నందమూరి కుటుంబంలో మరో జంట ఓ ఇంటి వారయ్యారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు నందమూరి చైతన్యకృష్ణ వివాహం ఈరోజు జరిగింది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడైన జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణ, రేఖల వివాహానికి నందమూరి బంధువర్గమంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రేఖ గుమ్మడితో చైతన్య కృష్ణ నిశ్చితార్థం ఈ నెల 5న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగింది. ఈ రోజు జరిగిన వివాహానికి నందమూరి, గుమ్మడి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. బాలకృష్ణ, మోహన కృష్ణ, కళ్యాణ్ రామ్, తేజస్విని దంపతులు తదితరులు ఈ వివాహానికి హాజరై చైతన్య కృష్ణ, రేఖలను ఆశీర్వదించారు.
వివాహ వేడుకల నిర్వహణలో బాలకృష్ణ క్రియాశీలకంగా వ్యవహరించారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా అందరి దృష్టినీ ఆకర్షించాడు. చైతన్యకృష్ణ ‘ధమ్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పివ్యాపార వ్యవహారాల్లో బిజీ అయ్యారు. వధువు రేఖ మరెవరో కాదు ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు నిర్మించిన విజయ వాహిని స్టూడియోస్ అధినేత ఆలూరి చక్రపాణి కుటుంబంలోని వ్యక్తి. ఈ వివాహం ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read : కరోనా అంతానికి నందమూరి బాలయ్య మంత్రం!