చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో మాట్నీ .. కొణిదెల సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిరంజీవి – కాజల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా, ఆయన జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇక విలన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉంది. చిరంజీవి క్రేజ్ కి తగిన పవర్ఫుల్ విలన్ కోసం సెర్చ్ చేస్తూనే, మిగతా షూటింగు చేసుకుంటూ వచ్చారు.
‘ఆచార్య’లో విలన్ పాత్ర కోసం చాలామంది ఆర్టిస్టులను పరిశీలించిన ఈ సినిమా టీమ్, ఫైనల్ గా బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గుప్తాను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. హిందీ .. బెంగాలీ సినిమాల్లో విలక్షణ నటుడిగా జిషు సేన్ గుప్తాకు మంచి పేరు ఉంది. ఈ మధ్య తెలుగులో వచ్చిన ‘భీష్మ‘ .. ‘అశ్వద్ధామ’ సినిమాల్లో ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన యాక్టింగ్ స్టైల్ ను చూసిన చిరంజీవి ఓకే చెప్పడంతో, ఈ పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు.
ఆల్రెడీ ‘ఆచార్య’ షూటింగులో జిషు సేన్ గుప్తా జాయిన్ అయ్యాడు. ఆయన కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడట. ఆ పాత్రకి జిషు కరెక్టుగా సరిపోయాడని అంటున్నారు. ఆయన నటన కొత్తగా ఉండి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. మే 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులకు తెరతీయడం ఖాయమనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- మెగా ‘ఆచార్య’కు వార్నర్ బ్రదర్ తోడయ్యాడు











