రైతుల డిమాండ్ల పట్ల కేంద్రప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరిస్తున్నదో శనివారం సాయంత్రానికి మళ్లీ ఒకసారి నిరూపణ అయింది. మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలకు పిలిచిన రైతు సంఘాలతో.. సాయంత్రం దాకా మాట్లాడి.. వారి డిమాండ్లను అంగీకరించకుండా.. ‘ఎల్లుండి మాట్లాడుకుందాం’ అని చెప్పి.. మంత్రి నరేంద్ర తోమర్ లేచి వెళ్లిపోవడం శనివారం నాటి అప్డేట్. 9వ తేదీ బుధవారం మరో విడత చర్చలు జరగనున్నాయి.
రైతుల సంఘాల నేతలతో కేంద్రం చర్చలు మరోసారి ఎటూతేలలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాల్సిందేనన్న డిమాండుపై రైతులు వెనక్కు తగ్గలేదు. పట్టు వీడలేదు. రైతుల నిరసనల్లో పాల్గొన్న చిన్నారులు, వృద్దులను తిరిగి ఇంటికి వెళ్ళాలని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞప్తి చేసారు. వారి సమస్యల గురించి పట్టించుకోకుండా, ఈ సానుభూతి వచనాలేమిటో అర్థం కాని సంగతి.
పంటలకు మద్దతు ధర పై లిఖిత పూర్వక హామీ ఇస్తామన్న కేంద్రం మాటకు రైతులు లొంగలేదు. 45 పంటలకు మద్దతు ధర ఉన్నా అందులో 94 శాతం పంటలకు రైతులకు మద్దతు ధర రావడం లేదని వారు తెలియజేశారు. రైతులు పండించే పంటలను మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారిని అరెస్ట్ చేసి ఐదేళ్ల పాటు జైల్లో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి కఠినంగా శిక్షించాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 8న భారత్ బంద్ ను వాయిదా వేయాలని రైతు సంఘాలను కేంద్రం కోరినప్పటికీ వారు తగ్గలేదు. బంద్ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. వ్యవసాయ చట్టాల రద్దు, రైతు డిమాండ్లను ఒప్పుకుంటే మాత్రం, వెంటనే ఆందోళనలు విరమిస్తామన్న రైతు సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.
Must Read;- వ్యవసాయ చట్టాలు అంత ప్రమాదకరమా?