కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు చేపట్టిన ఢిల్లీ ముట్టడి కార్యక్రమం హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్ రైతులు ఢిల్లీ చేరుకోక ముందే హర్యానా సరిహద్దుల్లోనే అడ్డుకోవాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. హర్యానా సరిహద్దులో శుక్రవారం పోలీసులకు, పంజాబ్ రైతులకు తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. బారికేడ్లను దాటుకుని పంజాబ్ రైతులు నేడు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా?
కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వేలాది రైతులు బయలుదేరారు. పంజాబ్ నుంచి ఢిల్లీ చేరడానికి మధ్యలో వారు అసలు హర్యానాలో ఎంటర్ కాకుండానే.. ప్రభుత్వం అడ్డుకుంటోంది. రైతులేమైనా ఉగ్రవాదులా వారికి దేశ రాజధానిలో నిరసన తెలిపే హక్కు లేదా అని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. భీకరమైన చలిగాలులు వీస్తున్నా రైతులు ఢిల్లీ చేరుకునేందుకు వందలాది ట్రాక్టర్లపై పట్టాకప్పుకుని రాత్రంతా రోడ్డపైనే బసచేశారు. ఇవాళ రైతులు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.
Must Read ;- బతికిబట్టకట్టాలంటే ఢిల్లీ విడిచి వెళ్లాల్సిందేనా?
ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత
ఢిల్లీ సమీపంలోని అంబాల శింబు సరిహద్దు, సింగు సరిహద్దు, ఫరీదాబాద్, గురుగావ్, నోయిడా సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పోలీసులు చర్యలతో ఢిల్లీ సరిహద్దుల్లో జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనల ద్వారా సమస్య పరిష్కారం కాదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేందరసింగ్ తోమర్ అభిప్రాయపడ్డారు. డిసెంబరు 3వ తేదీన చర్చలకు రావాలని రైతుల సంఘాల నాయకులను మంత్రి కోరారు.
రైతులతో యుద్ధమా?
కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను పంజాబ్ రైతులు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుని రైతుసంఘాలతో చర్చలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అలా చేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీలో నిరసన తెలుపుతామంటూ బయలుదేరగానే, ఉగ్రవాదులు ఢిల్లీని ముట్టడిస్తున్నారంత హడావుడి చేసి హర్యానా సరిహద్దుల్లోనే వారిని అడ్డుకోవడం శోచనీయం. సరిహద్దుల్లో రైతులపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఈ సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ రైతుల సమస్యను గుర్తించి, దానిపై చర్చలు జరపాల్సిన కేంద్రం మిన్నకుండిపోయింది. తాజాగా వేలాది రైతులు నిరసన తెలపడంతో, వారిని చర్చలకు ఆహ్వానించింది. ఎప్పటి నుంచో రైతులు పంజాబ్ లో తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. అప్పుడే కేంద్రం వారితో చర్చలు జరిపితే వ్యవహారం ఇంత ముదిరేది కాదు. దేశంలో ఏదైనా ఒక ప్రాంతం వారిపై కక్షకట్టినట్టుగా వ్యవహరిస్తే దేశ సమగ్రతకే ముప్పని కేంద్రం గ్రహించాలి. పంజాబ్ కూడా భారత్ లో భాగమని, పంజాబ్ రైతులు కూడా భారీతీయులేనని, వారి సమస్యలను కూడా పరిష్కరించాల్సి బాధ్యత కేంద్రంపై ఉందని గ్రహించాలి. లేదంటే మరో వేర్పాటు వాద తీవ్రవాదానికి బీజం పడే ప్రమాదం లేకపోలేదు.
Also Read ;- భీమసింగి షుగర్స్‌ను ఉంచుతారా..? ముంచుతారా ..?