బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఇప్పటికే పలుమార్లు ఆమె బెయిల్ విజ్ఞప్తి తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం సాయంత్రం అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయింది. నిబంధనలతో కూడిన బెయిల్ ను సికింద్రాబాద్ కోర్టు ఆమెకు మంజూరు చేసింది.
హఫీజ్ పేట్ భూ లావాదేవీలకు సంబంధించి.. ప్రవీణ్ రావు సోదరులు ముగ్గురిని బోయిన్ పల్లిలోని వారి ఇంటినుంచి కిడ్నాప్ చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. భూమా నాగిరెడ్డికి చెందిన భూముల వ్యవహారంలోనే వీరి కిడ్నాప్ జరిగింది. మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేయగా, అప్పటికే భార్గవరామ్ పరారయ్యారు. తర్వాత.. ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి కూడా కిడ్నాప్ తో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
అఖిలప్రియ పాత్రను నిర్ధారించేలా పోలీసులు చాలా పక్కా ఆధారాలను సేకరించారు. ఆమెను తొలుత కేసు పెట్టిన సమయంలో ఏ2 గా పేర్కొన్నప్పటికీ తర్వాత ఏ1గా మార్చారు. మూడురోజుల పోలీసు కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న అఖిలప్రియ ఆరోగ్యం సవ్యంగా లేదని, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని అరెస్టు అయిన తొలిరోజునుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ.. ఇప్పటిదాకా మంజూరు కాలేదు.
అఖిలప్రియ మాజీ మంత్రి, సమాజంలో పెద్ద హోదా ఉన్న వ్యక్తి కావడంతో.. ఆమెకు బెయిల్ మంజూరు అయితే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తారని పోలీసులు బెయిల్‌కు అడ్డుపడ్డారు. ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు గురువారం ఆమోదించింది. అదే సమయంలో ఆమె భర్త భార్గవరామ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ప్రస్తుతం భూమా అఖిలప్రియ చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్నారు. బెయిల్ ఉత్తర్వుల అనంతరం, ఆమె శనివారం ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Must Read ;- వారు దొరికితేనే.. కిడ్నాప్‌పై క్లారిటీ