చిరంజీవి కథానాయకుడిగా చరణ్ నిర్మాణంలో ‘ఆచార్య‘ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను కొంతవరకూ చిత్రీకరించారు. అలాగే కాజల్ కాంబినేషన్లోని సీన్స్ ను కూడా షూట్ చేశారు. ఆ మధ్య ‘ఆచార్య’ సెట్ కి కాజల్ తన భర్తను తీసుకుని రావడం, చిరంజీవితో పాటు ఈ సినిమా టీమ్ నూతన దంపతులతో కేక్ కట్ చేయించి శుభాకంక్షాలు అందజేయడం తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ ‘ఆచార్య’ షూటింగులో పాల్గొనడానికి కాజల్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. త్వరలో చిరంజీవి .. కాజల్ .. చరణ్ కాంబినేషన్లోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకే ఆమె మళ్లీ ఈ షెడ్యూల్లో జాయిన్ కానుంది. ఈ షెడ్యూల్లో ఆమె పోర్షన్ కి సంబంధించిన సన్నివేశాలను కొరటాల సెట్ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ వంటి సూపర్ హిట్ చిత్రంలోనూ .. చరణ్ తో ‘మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ లోను నటించిన కాజల్, ఆ ఇద్దరితో కలిసి ‘ఆచార్య’ చేస్తుండటం విశేషం.
దేవాదాయ భూముల ఆక్రమణకు పాల్పడిన అవినీతి పరులైన రాజకీయనాయకులను ఎదిరించే పౌరుడిగా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనున్నాడని అంటున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి డాన్సులను .. ఫైట్లను కొరటాల కొత్తగా డిజైన్ చేయించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. వినోదంతో పాటు సందేశాన్ని మేళవించి కొరటాల సిద్ధం చేసిన ఈ కథ అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, సంచలనానికి తెరతీయడం ఖాయమనేది అభిమానులు చెబుతున్న మెగా మాట.
Must Read ;- చరణ్ .. పూజా హెగ్డే పాటేసుకోవడానికి మెలోడీ రెడీ!











