టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ శ్రేణులు రాళ్లదాడి చేశాయి. అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడితో ఎమ్మెల్యే ఇంట్లోని అద్దాలు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వారిని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ధర్మారెడ్డి ఏమన్నారంటే..
రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. అకౌంట్‌బులిటీ లేకుండా దేవుని పేరుతో ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసి అవసరం ఏముందని ధర్మారెడ్డి ప్రశ్నించారు. రాముడు అందరి వాడని, హిందువైన ప్రతి ఒక్కరూ పూజిస్తారని తెలిపారు. రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి బీజేపీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.
Must Read ;- జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’