గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేనిఫెస్టో వార్ సాగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టోలు విడుదల చేయగా నేడు బీజేపీ సైతం తన మేనిఫెస్టో విడుదల చేసింది. దీంతో రాజకీయ దుమారం మరింత పెరిగింది. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీఆర్ఎస్ విమర్శలు మొదలు పెట్టింది. బీజేపీ మేనిఫెస్టో అంశంపై కేటీఆర్ విమర్శలు మొదలు పెట్టారు. వరద సాయంపై మంత్రి కేటీఆర్ మొదటి నుండి బీజేపీపై విమర్శల బాణాలు విసురుతున్నారు. అసలు ఇచ్చే పైసలు ఆపమని చెబుతున్న బీజేపీ .. రూ.25 వేలు సాయం చేస్తుందంటే నమ్ముతారా అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీంతో బీజేపీ సైతం కేటీఆర్ వ్యాక్యలకు కౌంటర్ ఇస్తూ ధీటుగా సమాధానం చెబుతోంది.
ప్రజా సంక్షేమంపై బీజేపీ దృష్టి..
బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది. ఎస్సీ వాడలు, స్లమ్‌లలో ఆస్తి పన్ను రద్దు, 125 గజాల వరకు ఎటువంటి రుసుము లేకుండా నిర్మాణాలకు అనుమతి.. ఉచిత మంచి నీరు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు ఆన్ లైన్ క్లాస్‌ల కోసం పేద పిల్లలకు ఉచితంగా ట్యాబ్‌లను కూడా అందిస్తామని.. మూసి అభివృద్ధిని వేగవంతం చేస్తామని ప్రకటించారు. మూసీలో కలిసే డ్రైనేజీలను డైవర్ట్ చేసేందుకు రూ.పదివేల కోట్లు కేటాయిస్తామంటున్నారు. ఇక సబర్మతి తరహాలో మూసిని అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇక నగరంలో చెత్త మేనేజ్ మెంట్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెలూన్‌లకు వడ్డీలేని రుణాలు, వ్యాపారులకు రాయితీలు కూడా ప్రకటించింది.
మా అభివృద్ధి కార్యక్రమాల ఫోటోలు వాడినందుకు ధన్యావాదాలు : కేటీఆర్
అయితే, బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు వాడిన ఫోటోలను కూడా టీఆర్ఎస్ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ మేనిఫేస్టోలో వివిధ ప్రాంతాల నుండి ఫోటోలను సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫోటోలను కూడా బీజేపీ నేతలు వాడారు. నగరంలో చెత్త తరలింపు కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పిన బీజేపీ ఆ అంశానికి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పోటోను వినియోగించింది. మేనిఫెస్టోలో మహిళా పోలీస్ స్టేషన్‌లు కట్టిస్తామని చెప్పింది బీజేపీ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే మహిళా పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తామని చెబుతోందని.. ఇక్కడ గెలిస్తే పోలీస్ స్టేషన్ ఎలా కడతారని..ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదా అంటూ ప్రశ్నిస్తోంది టీఆర్ఎస్. ఇక దీనికి వాడిన పోలీస్ స్టేషన్ టీఆర్ఎస్ సర్కార్ కట్టిందే కదా అంటూ విమర్శిస్తున్నారు. ఇక మహిళా టాయిలెట్ నిర్మాణం చేపడతామని మేనిఫెస్టోలో వినియోగించిన ఫోటో కూడా టీఆర్ఎస్ కట్టిందేనని చెబుతున్నారు. తాము చేసిన అభివృద్ది బీజేపీ మేనిఫెస్టోలో కూడా చూసుకోవచ్చని.. విమర్శించేందుకు బీజేపీకి ఏమీ లేక ఇలా ఎదురు దాడులకు దిగడంతో పాటు దృష్టి మరల్చేందుకు మతపరమైన ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. మొత్తానికి గ్రేటర్ ప్రచారంలో మేనిఫెస్టో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
Also Read: ‘పబ్లిక్ టాయిలెట్లను కేసీఆర్, కేటీఆర్ వాడుతున్నారు’