గ్రేటర్‌లో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది శాంతి భద్రతల అంశం కీలకంగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీలకు తోడు ఎంఐఎం కూడా జత కలవడంతో మరింత వేడి పుడుతోంది. కూల్చి వేతలు, తొలగింపులు, బెదిరింపులు, హెచ్చరింపులు ఇలా ప్రచారం పూర్తిగా మూడు పార్టీలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ.. ఎంఐఎం, టీఆర్ఎస్‌లను టార్గెట్ చేస్తుంటే, ఎంఐఎం.. బీజేపీ, టీఆర్ఎస్‌లను టార్గెట్ చేస్తోంది. టీఆర్ఎస్ మాత్రం బీజేపీనే టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తోంది. ఇక మతాల ప్రస్తావన కూడా ఈ సారి భారీగానే వచ్చింది. హిందువులకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తోందని.. ఇక అది నడవబోదని బీజేపీ దూకుడుగా ప్రకటనలు చేస్తుంటే.. మత రాజకీయాలు లేకుండా బీజేపీ ఎన్నికల ప్రచారం చేయడం లేదంటూ టీఆర్ఎస్ విమర్శిస్తోంది.
దుమారం రేపిన సర్జికల్ స్ట్రైక్..
హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని, బీజేపీ మేయర్ అయితే రోహింగ్యాలను ఏరేసేందుకు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తరువాత అక్బరుద్దీన్ సమాధుల తొలగింపు అంశం మరో దుమారం రేపింది. ఏకంగా బండి సంజయ్ పీవీ, ఎన్టీఆర్ సమాధుల వద్దకు వెళ్ళి వీటికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమాధుల జోలికి వస్తే దారుస్సలాంను కూల్చివేస్తామంటూ బండి సంజయ్ హెచ్చరించారు. ఇక బీజేపీ వర్సెస్ ఎంఐఎం సవాళ్ళ పర్వంతో అధికార పార్టీ అప్రమత్తం అయ్యింది. పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో అరాచక శక్తులు ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.
అరాచక శక్తులు ఉంటే అరెస్ట్ చేయండి : బండి సంజయ్, కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలో ఉంటే చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి ఎందుకు విఫలమవుతున్నారంటూ ప్రశ్నించారు. ఎంఐఎం నేతలను చంకలో పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు తమపై ఉసిగొల్పాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో కాని, తెలంగాణలో కాని , దేశంలో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. డీజీపీ వ్యాఖ్యలను ఆయన తేలిగ్గా తీసుకున్నారు.. ప్రగతి భవన్‌లో రాసిన స్క్రిప్ట్‌ను ఆయన చదివారంటూ లైట్ తీసుకున్నారు. మొత్తానికి గ్రేటర్ వార్ గతంతో పోల్చితే భారీగా హీట్ పెంచింది. శాంతి భద్రతల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న పార్టీలను ప్రజలు ఎలా స్వీకరిస్తారు..ఎవరి పాలనలో ప్రశాంత వాతావరణం ఉంటుందని ప్రజలు నమ్ముతారో గ్రేటర్ ఫలితాల్లోనే తేలుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read: సీఎంకు సవాల్ విసిరిన బండి సంజయ్.. పాతబస్తీలో టెన్షన్.. టెన్షన్!