గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు అందులో హామీల వర్షం కురిపించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు సరీసమానంగానే అటు ఇటుగా బీజేపీ పార్టీ సైతం తమ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ ఈ రోజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాల ఉందన్నారు. ప్రజలతో మాట్లాడి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని అంశాలు..
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా పేదలకు కరోనా టీకాలు వేయిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. వరద బాధితులకు రూ.25వేల ఆర్థిక సాయం అంధిస్తామని పేర్కొన్నది. అలాగే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని తెలుపుతూ మధ్య తరగతి ఓట్లను దండుకునే ప్రయత్నాన్నిబీజేపీ చేసింది. వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్ నాలాలను పునరుద్ధరణ చేస్తామని మేనిఫోస్టోలో పేర్కొన్నది. దీంతో పాటు లక్ష కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనా ఇళ్ళను నిర్మిస్తామని తెలిపింది. హైద్రాబాద్ మహిళలకు మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చింది.
క్వాలిటీ విద్య కోసం విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పింది. ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తిపన్ను రద్దు. 125గజాల లోపు ఇళ్ళ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నగర ప్రజలకు ఉచిత మంచి నీరు అందిస్తామని హామీల్లో పేర్కొన్నది. గంగా ప్రక్షాళన, సబర్మతి నది ప్రక్షాళన మాదిరిగానే మూసీనది పక్షాళన చేపడతామని తెలిపింది. పేదలకు 100 యానిట్లు వరకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని బీజేపీ పేర్కొన్నది.హైద్రాబాద్ నాలాలపైఅక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కూడా తెలిపింది. ముఖ్యంగా హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు సెప్టెంబర్ 17 వేడుకలను జరుపుతామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది.
Must Read ;- ఎన్టీఆర్‌ని భుజాన ఎత్తుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్!
Also Read ;- ఎన్టీఆర్, పీవీ సమాధులపై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్ధీన్ ఓవైసీ