గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటుంటే .. జాతీయ నేతలు వచ్చి టీఆర్ఎస్‌కు చురకలు అంటిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం దూకుడు చూసి టాప్ బాస్‌లు ఒక్కొక్కరు హైదరాబాద్ బాట పడుతున్నారు. ఇక గ్రేటర్‌లో విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, జాతీయ నాయకుల పర్యటనలు అదనపు బలమని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు నగరంలో పర్యటించి వెళ్లారు. ఇందులో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడి పర్యటన దుమారం రేపింది. అనుమతులు లేకుండా ఆయన ఓయూ క్యాంపస్‌లో అడుగు పెట్టారంటూ పోలీసులు కేసులు బుక్ చేశారు.
ఎంఐఎం, టీఆర్ఎస్‌పై స్మృతి ఫైర్..
గ్రేటర్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరాని టీఆర్ఎస్, ఎంఐఎంల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నగరంలో రోహింగ్యాలు పెరిగిపోయారని.. వారి ఓటు బ్యాంకుతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక నగర పర్యటనలో భాగంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మేనిఫెస్టోతో నగర వాసులపై తాయిలాల వర్షం కురిపించారు. ఉచితంగా మంచి నీరు, ట్యాబ్‌లు, పేదవారికి ఉచితంగా ఇళ్ల నిర్మాణ అనుమతులు, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా అనేక తాయిలాలు ప్రకటించి ప్రజల దృష్టిని ఆకర్శించారు. ఇక వీరితో పాటు జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు సైతం వచ్చి తన పని తాను చేసుకు పోయారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీపై ఫైర్ అవుతున్నారు.
ఇక చివరి స్ట్రైక్‌గా మోడీ..
గ్రేటర్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ దూకుడు మరింత పెంచింది. జాతీయ నాయకుల పర్యటనలను ఉధృతం చేసింది. వచ్చే మూడు రోజల పాటు కీలక నేతలు నడ్డా, యోగి, అమిత్ షాల పర్యటన షెడ్యుల్ సిద్ధం చేసింది. అధికారికంగా వారు రావడం ఖరారు అయ్యింది. దీంతో బీజేపీపై అంచానాలు అమాంతం పెరిగి పోయాయి. ఇక వీరి పర్యటనలతోనే రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయనుకుంటే ఏకంగా ప్రధాని మోడీ సైతం హైదరాబాద్ రాబోతున్నారన్న వార్తలు మరింత హీట్‌ను పెంచాయి. ప్రధాని భారత్ బయోటెక్ కంపెనీ విజిట్ చేసి వ్యాక్సిన్ తయారీపై కంపెనీ పెద్దలతో మాట్లాడతారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే బీహార్ తరహాలోనే ఇక్కడ కూడా వాక్సిన్ ఎన్నికల అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీ రాకతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మరింత ఖాయం అన్న అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. సౌత్‌లో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్నితమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్లాన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read: అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్