రాజకీయం అంటేనే చదరంగం.. ఆ చదరంగంలో ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వెళ్లాలి. ఆటలో ఎంత సీనియార్టీ ఉన్నా.. ఒక్క స్టెప్ రాంగ్ వేసినా.. కోలుకోవడం కష్టం.. ఆ ఎత్తు వేసిన వారు విలువలు పాటించారా లేదా.. స్నేహ ధర్మం పాటించారా.. వెన్ను పోటు పొడిచారా.. ఇవన్నీ పక్కన పడేయాల్సిందే. గెలిచామా లేదా అనేదే ఇప్పటి రాజనీతి. అదే టైంలో ఎన్నికల్లో గెలవాలంటే.. మన బలపడడం ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థిని బలహీనం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇదంతా ఎందుకంటే..ప్రస్తుతం GHMC ఎన్నికల ప్రచారంలో పార్టీల ఎత్తులు, ప్రచార అంశాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. రెండురోజులుగా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. అయితే బీజేపీ, MIM పార్టీలు మాత్రం ఇంకాస్త ముందుకెళ్లాయి. పరిస్థితిని వేడెక్కించాయి. సెంటిమెంట్ తో కూడిన అంశాలను తెరమీదకి తీసుకొచ్చాయి.
ఇదంతా ప్రచారంలో భాగంగా.. కాకతాళీయంగా జరిగిందని చెప్పేవారు ఉన్నారు. అదే సమయంలో వ్యూహాత్మక వ్యాఖ్యలే అని విశ్లేషించే వారూ ఉన్నారు. వ్యూహాత్మక వ్యాఖ్యలుగా విశ్లేషిస్తున్నవారు.. ఇటీవల దేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో కొన్ని అంశాలను తెరపైకి తెస్తున్నారు. అందులో భాగంగానే BJP-MIM మధ్య వాగ్యుద్దాలు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. ఆ అంశాల్లోకి వెళ్తే…
దేశంలో శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంకు భారీగానే ఉంది. (ఉండేది). ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసేందుకు బీజేపీ పక్కా ప్లానింగ్ చేస్తోందనే విమర్శలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చి.. మైనార్టీల ఓట్లను MIMకి మళ్లిస్తే.. కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు తగ్గుతాయి. అదే టైంలో తాము ఎలాగూ సెటింమెంట్‌ను వాడుకుంటాం కాబట్టి.. తమకు, తమ కూటమి వారికి అది మేలవుతుందనే వ్యూహం బీజేపీ అమలు చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేత, లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి MIM పార్టీని ఓట్ కట్టర్ గా అభివర్ణించేందుకు కూడా ఈ వ్యూహమే కారణం. కాంగ్రెస్ పార్టీ విమర్శల్లో ఎంత నిజం ఉందో చెప్పలేం కాని.. MIM మాత్రం గత కొన్నేళ్లలో కాంగ్రెస్ కు, కాంగ్రెస్ కూటమికి భారీగానే నష్టం కలిగించింది.
ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఇదే అమలుచేసిందన్న విమర్శలున్నాయి. మొన్న బీహార్ లో చూసుకుంటే.. అక్కడ బీజేపీ లీడర్లు మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో MIM కూడా బాబ్రీ మసీదు, CAA, ఆర్టికల్ 370లను తెరపైకి తెచ్చింది. గణనీయ సంఖ్యలో ఓట్లు రాబట్టింది. అక్కడ ఎంఐఎం 5 చోట్ల గెలిచింది. ఆమౌర్, బైసీ, కొచ్చాదామన్, బహదూర్ గంజ్, జోకిహాట్ లో గెలుపొందింది. అదే సమయంలో మైనార్టీల ఓట్లు తమకు పడకుండా చేసిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మహాఘట్ బంధన్ (కాంగ్రెస్ కూటమి) కోల్పోయిన వాటిలో కొన్ని సీట్లను పరిశీలిస్తే.. బరారిలో 11వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఎన్ డీఏ గెలిచింది. ఎంఐఎంకి 6598 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 5500 ఓట్లు మహాఘట్ బంధన్ కి పడితే వారే గెలిచేవారు. నర్పట్ గంజ్ లోనూ అదే పరిస్థితి. ఇక్కడ బీజేపీ కూటమి 28610 ఓట్లతో గెలిచింది. ఎంఐఎంకి 9495 ఓట్లు పడ్డాయి. అక్కడ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చిన BJP, MIMలు అక్కడ బలంగా ఉన్న ఆర్‌జేడీ భారీగా నష్టం కలిగించాయని చెబుతున్నారు. రాణిగంజ్ లో బీజేపీ 2304 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అక్కడ ఎంఐఎంకి 2412 ఓట్లు వచ్చాయి. సాహెబ్ గంజ్ లో బీజేపీ కూటమి 15333 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక్కడ ఎంఐఎంకి 4055 ఓట్లు వచ్చాయి. ఇలాంటి వ్యూహాలే పలుచోట్ల అమలయ్యాయి.
2017లో యూపీలో ఫిరోజాబాద్, మహల్ ఆజంగర్హ్, సంబల్, అమోరోహా, భాగ్పుట్, ఘజియాబాద్, కాన్పూర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో MIM మొత్తం 29 స్థానాగెలిచింది. 109కి పైగా స్థానాల్లో ఫలితాలు తారుమారు చేసేన్ని ఓట్లను MIM రాబట్టుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
ఇక 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో ఆ పార్టీ రెండు స్థానాలు గెలిచింది. ఆ ఎన్నికల్లో MIM ఎన్నడూ లేని విధంగా 44 చోట్ల పోటీచేసింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఆ పార్టీ తెలంగాణలోనే ఇప్పటివరకు అన్ని స్థానాల్లో ఇటీవలి కాలంలో పోటీచేయలేదు. కాని అక్కడ 44 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపింది. రెండు చోట్ల గెలిచింది. కాని మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకుని కాంగ్రెస్ కూటమికి నష్టం కలిగించిందని, బీజేపీని, బీజేపీ మిత్రపక్షాలను గెలిపించేందుకు ప్లాన్ చేసిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడిన సీట్లను పరిశీలిస్తే దాదాపు 36చోట్ల MIM తదితర పార్టీలు దారుణమైన దెబ్బ కొట్టాయి. పూణె కంటోన్మెంట్ నియోజకవర్గంలో అక్కడ గెలిచిన బీజేపీ అభ్యర్థికి 52160 ఓట్లు రాగా కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి 47148 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎంఐఎం 6041 ఓట్లు సాధించింది. బుల్దానా, అకోట్, బాలాపూర్, మూర్తిజాపూర్, వాషిం, కలంనూరి, ఔరంగాబాద్ సెంట్రల్ తదితర స్థానాల్లో ఇదే జరిగింది. ఈ అంశాలను బీజేపీ – MIM లోపాయికారీ ఒప్పందంగా కాంగ్రెస్ విమర్శిస్తోంది.
అన్న బీజేపీపై, తమ్ముడు టీఆర్ఎస్ పై
తాజాగా GHMC ఎన్నికల అంశాన్ని పరిశీలిస్తే.. MIM పార్టీ ఈ సారి కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. అసదుద్దీన్ జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీపై, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుండగా అక్బరుద్దీన్ స్థానిక టీఆర్ఎస్, స్థానిక కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. ఇది కూడా వ్యూహంగానే పార్టీలు అంచనా వేస్తున్నాయి. రెండురోజుల క్రితం అక్బరుద్దీన్ తన ప్రసంగంలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులపై వ్యాఖ్యలు చేశారు. వెంటనే బీజేపీ ఆ అంశాన్ని అందుకుంది. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ల అభిమానులు లేదా వారి ఓటు బ్యాంకు తమకు మళ్లించుకునే యత్నంగానే పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్, టీడీపీలూ స్పందించాయి. అయితే బీజేపీ మాత్రం చాలా అగ్రెసివ్ గా స్పందించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి PVపై, NTR పై అంత ప్రేమ ఉంటే.. భారతరత్న ఇవ్వాలని వ్యాఖ్యానించాయి. మొత్తంమీద BJP –MIM పార్టీల వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ఉన్నాయా.. లేక కాకతాళీయంగా ఆ వ్యాఖ్యలు వచ్చాయా అన్న విషయం పక్కన బెడితే.. సెంటిమెంట్ ను రగిల్చి.. ఓట్లను రాబట్టుకునే కార్యాచరణ ఉందని మాత్రం చెప్పవచ్చు.
Must Read ;- ఎన్టీఆర్‌ని భుజాన ఎత్తుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్!