దీపావళి పండుగ రోజు తెలంగాణలో టపాసులు కాల్చవద్దని, విక్రయాలు కూడా జరపొద్దని క్రాకర్లు కాల్చడాన్ని బ్యాన్ చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వ్యాపారులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇదే విషయం ముందస్తుగా చెప్పి ఉంటే వ్యాపారాల కోసం భారీ పెట్టుబడులు పెట్టే వాళ్లం కాదని, సరుకు తెచ్చుకున్నాక నిషేధం విధిస్తే రూ.కోట్ల రూపాయాలు నష్టపోతామని బాణాసంచా నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలు ఉండాలని సుప్రీం కోర్టు సూచించింది.
నవంబర్ 9వ తేదీన బాణాసంచా వినియోగంపై ఎన్జీటీ తీర్పును వెలువరించింది. అయితే గాలి నాణ్యత తీవ్రంగా ఉన్న చోట బాణాసంచా పూర్తిగా నిషేధం విధించాలని ఎన్జీటీ తెలిపింది. గ్రీన్ కాకర్స్ కూడా గరిష్టంగా రెండు గంటలు మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. గాలి నాణ్యత మధ్యస్తంగా ఉన్న చోట మాత్రమే పర్యావరణహిత క్రాకర్లను కాల్చాలని సూచించింది. ఈ ఎన్జీటీ తీర్పునకు లోబడే తెలంగాణలో క్రాకర్ల వినియోగం ఉండాలని సూచిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రాంతాల్లో నిషేధం కొనసాగనుంది. గాలి నాణ్యత ఉన్న మిగతా ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ వినియోగించుకోవచ్చని సుప్రీం అనుమతిచ్చింది. ఈ కేసును నవంబర్ 16కు వాయిదా వేస్తూ ప్రతివాదులకు నోటీసులను సుప్రీం జారీ చేసింది. తెలంగాణలో బాణాసంచా అమ్మడం, కాల్చడం చేస్తే కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలివ్వడంతో వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.
AlsoRead ;- చేతులు కాలాక.. ఉత్తర్వులు ఫలితమిచ్చేనా?