ఒక జీవిని భూమిపైకి తీసుకురాగలిగే శక్తి ఆడవారికి మాత్రమే ఉంటుంది. అది ఆడవారికి అందిన వరంగా భావిస్తారు. నేటికీ, ప్రసవ సమయంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. కానీ, ఒక్కరు కూడా బిడ్డకు జన్మనివ్వడం భారంగానో, ప్రమాదంగానో భావించడం లేదు. కనీసం కళ్లు తెరవని పసి బిడ్డను కడుపులో పోగొట్టుకున్నా కూడా ఆడవారి బాధ వర్ణణాతీతం. అటువంటి పరిస్థితిని అనుభవించాను అంటున్నారు బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ ఇంట అడుగుపెట్టిన మేగన్ మార్కెల్. తాజాగా తన బాధను పంచుకున్నారు. తనతో పాటు, మన భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోన్నామని చెప్పుకొచ్చారు కొందరు నాయికామణులు. మరి వారి గాధలు తెలుసుకుందాం రండి.
బాధతో నేలకొరిగిపోయాను
ఈ ఏడాది జులై నెలలో ఆర్చితో ఆడుకుంటున్న సమయంలో హఠాత్తుగా పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. చేతిలో ఆర్చిని అలాగే పొదివిపట్టుకుని నేలకు ఒరిగిపోయాను. అంత బాధలోనూ ఆర్చిని సముదాయిస్తున్నాను. నేను, నా భర్త కొన్ని గంటలపాటు ఆ పరిస్థితి నుంచి బయటకు రాలేకపోయాం. కడుపులోని బిడ్డను పోగొట్టుకోవడం భరింపరాని బాధ. ఇలా తన బాధను, జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది మేగన్.
ప్రాణాలకే ప్రమాదం అన్నారు
కాజోల్-అజయ్ దేవగన్, వివాహాం చేసుకుని 2 దశాబ్దాలు దాటినా నేటికి వీరిని చూస్తే, కొత్త జంటలా కనిపిస్తారు.1999 లో పెళ్లిపీటలెక్కిన ఈ జంటకు 2003 లో నైసా అనే పండంటి ఆడబిడ్డ పుట్టింది. కానీ అంతకంటే ముందే 2001 లో తాను గర్భం దాల్చానని, కానీ ప్రాణాలకు ప్రమాదమని తెలియడంతో బిడ్డను కోల్పోయానని చెప్పుకొచ్చింది. తిరిగి అనతి కాలంలోనే గర్భం దాల్చినా, గర్భాశయం ఆవల పిండం ఏర్పడడంతో మళ్లీ అదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని తెలియజేసి అందరికీ షాకిచ్చింది కాజోల్. నా బాధను తొలగిస్తూ నైసా పుట్టి నా జీవితాన్నే మార్చేసిందని ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Also Read ;- తల్లిదండ్రులను సృష్టిస్తున్న వైద్యులు
గర్భం దాల్చనేమోనని భయపడ్డా
సాగరకన్య అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘శిల్పాశెట్టి’. 2009 లో రాజ్ కుంద్రాతో వివాహ బంధం లోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ 2010 లో గర్భం దాల్చినా, గర్భకోస సమస్య వల్ల గర్భాన్ని కోల్పాయని చెప్పింది. తల్లికాబోతున్నాం అని తెలియడం ఎవరికైనా ఒక మధురస్పృతి, కానీ అబార్షన్ అయిన తర్వాత, ఇక తల్లిని కాలేనేమోనని తల్లడిల్లిపోయాను. 2012 వియాన్ జననంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయానని చెప్పింది.
2 నెలలు చాలా ప్రయత్నించాం
బాలీవుడ్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరు గాంచిన అమీర్ ఖాన్-కిరణ్ రావ్ 2005లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. 2009 లో గర్భం దాల్చిన కిరణ్, దానిని నిలుపుకోవడానికి 2 నెలల పాటు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు ఒకానొక సమయంలో చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. కానీ, చివరకు బిడ్డను కోల్పాయమని చెప్పుకొచ్చాడు. కొన్ని పరిణామాల తర్వాత 2011లో సరోగసి పద్దతిలో బిడ్డను పొందినట్టు చెప్పాడు.
సినిమా స్టార్స్ అంటేనే వారికేం బాధలుంటాయి అనుకుంటాం. వారు కూడా కొన్ని విషయాలకు అతీతులు కారు. అబార్షన్ వినడానికి చిన్నమాటే. కానీ, బిడ్డను కోల్పోయిన వారి బాధ మాటల్లో చెప్పరానిది. ఇలాంటి స్థితిలో స్టార్స్ అయినా మామూలు వారు లాగే బాధను అనుభవిస్తారు. ఆ పరిస్థితిని దాటి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చి అనందంగా గడుపుతున్నారీ తారలు.
Must Read ;- ‘మేల్ ప్రెగ్నెన్సీ’పై బాలీవుడ్ ప్రయోగం