ఏపీలో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. తొలివిడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్లకు గడువు ముగిసింది. పార్టీల గుర్తు లేకుండా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అనధికారికంగా పార్టీల జోక్యం అనివార్యం అవుతోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికార పార్టీకి సానుకూల అవకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ పంచాయతీ ఎన్నికల్లో పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం పర్యవేక్షణ ఉన్నా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినా.. నామినేషన్లకు అడ్డంకులు కల్పిస్తున్నారని పలుచోట్ల ఆరోపణలు వస్తున్నాయి. అయితే, చాలా చోట్ల ప్రత్యర్థి పార్టీలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఫిబ్రవరి 9న తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా..
ఇక బరిలో దిగిన అభ్యర్థులకు గతానికి భిన్నంగా ఈ సారి మరో టెన్షన్ మొదలైంది. బ్యాలెట్ విధానంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏపీలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టారు. 2019 జనవరిలో తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నోటా ముద్రించారు. ఇప్పుడు అదే టెన్షన్ పార్టీలను వెంటాడుతోంది. ఇందుకు కొన్ని ఉదాహరణలను ప్రస్తావించవచ్చు.
మూడు ఓట్లతో MLAగా గెలుపు..నోటాకు 52 ఓట్లు
2018లో మిజోరాంలో ఓ అసెంబ్లీ స్థానానికి వచ్చిన ఎన్నికల ఫలితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ప్రతీ ఓటు ఎంత కీలకమో కూడా చెప్పింది. ఆ ఎన్నికల్లో ఓ అభ్యర్థి మూడు ఓట్లతో విజయం సాధించారు. త్యూవల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎమ్‌ఎన్‌ఎఫ్) అభ్యర్థి లాల్‌చందామ రత్లే మూడు ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. రత్లేకు 5,207 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆర్‌ఎల్ పియాంమావియాకి 5,204 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 16,737 ఓట్లు ఉన్న ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి 58 ఓట్లు, నోటాకు 52ఓట్లు పడ్డాయి. అంటే నోటాకు పడే ఓటు ఎంతకీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే కాకుండా ఇటీవల తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పలువురు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది నోటా.
Must Read ;- ముగిసిన తొలిదశ నామినేషన్లు.. శ్రీకాకుళం జిల్లాలో ఘర్షణలు
GHMCలో నోటా ప్రభావం ఇదీ..
బంజారాహిల్స్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు 10,227, బీజేపీకి 9,446 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ 781 కాగా నోటాకు 805 ఓట్లు వచ్చాయి. మచ్చబొల్లారం డివిజన్‌లో గెలిచిన అభ్యర్థి మెజార్టీ 34కాగా ఇక్కడ నోటాకు 302ఓట్లు పడ్డాయి. డమ్మీ అభ్యర్థిగా నిలిచిన అభ్యర్థి కుమారుడికి 39 ఓట్లు పడడంతో సదరు మహిళ పరాజయం పాలైంది. మల్కాజిగిరి డివిజన్‌లో 172 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడారు. ఇక్కడ నోటాకు 245ఓట్లు పడ్డాయి వనస్థలిపురంలో బీజేపీ అభ్యర్థి 702ఓట్ల మెజార్టీతో గెలవగా చెల్లని ఓట్లు 259, నోటా ఓట్లు 269 పడ్డాయి. హస్తినాపురం డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి 279 ఓట్ల తేడాతో ఓడారు ఇక్కడ నోటాకు 247 ఓట్లు, 458 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అడిక్‌మెట్ డివిజన్‌లో గెలుపు ఓటముల మధ్య తేడా 239 ఓట్లు కాగా నోటాకు 265 ఓట్లు పోలయ్యాయి. ఇవే కాదు.. దాదాపు 47 డివిజన్లలో నోటాకు పడిన ఓట్లు, చెల్లని ఓట్ల మెజార్టీలతో దాదాపు సమానంగా వచ్చాయి.
పంచాయతీల్లో ప్రతి ఓటూ కీలకమే..
సాధారణంగా సింహభాగం పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 5వేల లోపే ఉంటుంది. ఇక లక్షలు, పదివేలకు పైగా ఓటర్లు ఉన్న చోట్ల గెలుపోటముల్లోపైన చెప్పిన విధంగా నోటా కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు అభ్యర్థులకు కీలకం కానుంది. నోటా ఓటు, చెల్లని ఓటు, ఓటు వేయకపోవడం అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. 2019లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో సగటున చాలా గ్రామాల్లో 65శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ 236 పంచాయతీల్లో నోటాకు పడిన ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా ఉంది. ఇక ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరోక్షంగా పార్టీల ప్రభావం ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఓటూ కీలకంగా మారింది. నామినేషన్లు ఖరారైన తరువాత గ్రామాల్లో పార్టీలూ, నాయకులూ రాజకీయ వ్యూహాలు అమలు చేయనున్నారు.
Must Read ;- నిమ్మగడ్డపై మరో అస్త్రం వదిలిన జగన్ సర్కారు