ఎన్ని రకాల బెదిరింపులు ఎదురవుతున్నా.. అధికార పార్టీ ఒత్తిళ్లకు, దందాలకు తలొగ్గకుండా.. వారి వైఫల్యాలను ఎండగడుతూ.. కొరుకుడు పడని మొండిఘటంగా దృఢంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. స్వగ్రామం కావడం ఒక్కటే.. వారికి ‘ఇజ్జత్ కీ సవాల్’ గా కనిపించి ఉండవచ్చు గాక! అంతమాత్రాన.. ఆ గ్రామంలో ప్రజల అభిమానాన్ని చూరగొని.. ఆయనను ఓడించే ప్రయత్నం చేయాలి గానీ.. రౌడీయిజయంతో చెలరేగిపొవాలనుకుంటే.. ప్రజలు చూస్తూ అసహ్యించుకోకుండా ఉంటారా?
ఈ విచక్షణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇసుమంతైనా కలిగినట్లు లేదు! అందుకే.. ‘నిమ్మాడ’ వంటి ఒక చిన్న గ్రామంలో సర్పంచి పదవికి నామినేషన్ వేస్తోంటే.. నియోజకవర్గ ఇన్చార్జి అనే హోదాతో చెలరేగుతున్న, రౌడీషీట్ చరిత్ర కూడా ఉన్న, దువ్వాడ శ్రీనివాస్‌ను తమకు అండగా తెచ్చుకున్నారు. సదరు దువ్వాడ శ్రీనివాస్ కూడా.. ఏ లక్ష్యంతో అయితే తాను సర్పంచి నామినేషన్ కోసం నిమ్మాడ వచ్చారో.. ఆ లక్ష్యాన్ని పూర్తిచేసి.. నానా రాద్ధాంతం చేసి.. ఉద్రిక్తతలకు ఆజ్యం పోసి, ‘ఎవడొస్తాడో రండిరా..’ అంటూ సవాళ్లు చేసి.. తన వంతు ప్రతిభను కూడా నిరూపించుకున్నారు.
నామినేషన్లకు చివరిరోజున- శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడిపించిన హైడ్రామా ఇది.
రౌడీషీటర్లు తప్ప దిక్కులేదా..
2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలనే ఆలోచన పుష్కలంగా వ్యక్తమైంది. అంతటి ప్రభంజనంలో కూడా.. తనదైన ముద్రను ప్రజలు విస్మరించకుండా… నెగ్గిన వారిలో అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. నాటినుంచి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉంటూ.. ప్రభుత్వం ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. వారి పనితీరులో తాము ఏ తప్పులను గమనించినా.. తన నిశిత విమర్శలతో చుక్కలు చూపిస్తున్నారు. ఆయనను పాతకేసుల మిషపై అత్యంత హేయమైన రీతిలో అరెస్టు చేశారు. నికృష్టంగా ప్రవర్తించారు. అన్నింటినీ తట్టుకుని.. ఆయన ఏకంగా రాష్ట్ర పార్టీ సారథ్యం అందుకుని.. పోరాడుతున్నారు. ఆయన స్వగ్రామంలో సర్పించి నామినేషన్ వేయించడానికి నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి వాసి అయిన దువ్వాడ శ్రీనివాస్ అవసరం పార్టీకి ఏమొచ్చింది.
Must Read ;- ముగిసిన తొలిదశ నామినేషన్లు.. శ్రీకాకుళం జిల్లాలో ఘర్షణలు
సదరు దువ్వాడ శ్రీనివాస్ ఒక రౌడీ షీటర్ అనే ముద్ర ఉంది. ఆయన మీద పోలీసు కేసులు నమోదై ఉన్నాయి. తాజా పరిణామం నేపథ్యంలో ఆయన మీద 13 పెండింగ్ కేసులు ఉన్నట్టుగా ఒక రౌడీషీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఏ తేదీనాటి పరిస్థితి అనేది తెలియకపోయినప్పటికీ.. ఆయనకు రౌడీషీట్ చరిత్ర ఉన్న మాట వాస్తవం.
అలాంటి వ్యక్తిని నాయకుడిగా, నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంచుకుని అధికార పార్టీ ఏం ఆశిస్తున్నదో.. అది నిమ్మాడలో ఆదివారం స్పష్టంగా కనిపించింది. ఆయన స్వయంగా కారుపైన ఎక్కి కూర్చుని సవాళ్లు విసురుతోంటే.. ఆయన నేతృత్వంలో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. ఇనుపరాడ్లు, క్రికెట్ బ్యాట్లు, కత్తులతో రౌడీ విహారం సాగినట్టు చూసిన వారు అంటున్నారు. పోలీసులు యథోరీతిగా ప్రేక్షకపాత్ర పోషించారు. అంతా కలిపి.. అచ్చెన్నాయుడును అంతం చేయడానికే ఇది అధికార పార్టీ కుట్రగా విపక్ష తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నామినేషన్ వేయడానికి వచ్చిన మూకలు.. వ్యానున మీదికి ఎక్కి బూతులు తిడుతూ.. టీడీపీ వారిని అంతం చేసేద్దాం అని వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. పలాస, ఒడిశానుంచి కూడా కిరాయి గూండాలు తరలివచ్చినట్టు తెలుస్తోంది.
పోలీసుల స్పందనేంటి?
సంఘటన జరిగినప్పుడు పోలీసులు ప్రేక్షకులే అయ్యారు. కనీసం ఆ తర్వాతైనా తాము పోలీసులం అని గుర్తు తెచ్చుకుని స్పందిస్తారా లేదా అని నిమ్మాడ ప్రజలు ఎదురుచూస్తున్నారు. టీడీపీ వారి కార్యక్రమాల్లో, సోషల్ మీడియా ఖాతాల్లో చీమ చిటుక్కు మంటే, హైటెక్ విధానాల్లో చటుక్కున పట్టేసుకునే పోలీసులు.. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కిరాయిగూండాలు.. ప్రశాంతమైన నిమ్మాడను రణక్షేత్రంగా మార్చేస్తే.. ఏం చేయబోతున్నారు? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
Also Read ;- పోలీసు నోటీసు: విగ్రహాల ధ్వంసంతో అచ్చెన్నకు లింకా?