తెలంగాణలో అదికార పార్టీ టీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కాకుండా కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) శనివారంనాడు తన 45వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కరోనా వేళ.. తన బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని మానేసి.. ఆ నిధులతో ఆపదలోని వారిని ఆదుకునేందుకు కేటీఆర్ స్వీయంగా తన పార్టీ కేడర్ కు, అభిమానులకు సూచించారు. కేటీఆర్ మాటను వింటూనే ఆయన విషెష్ చెబుతూ పార్టీ కేడర్ పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు. ఇలాంటి సందేశాల్లో ఓ సందేశం మాత్రం కేటీఆర్ ను మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఆ సందేశం ఎవరు పంపారు? అందులో ఏముంది? అన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
ఎంతైనా పత్రికాధిపతి కదా..
కేటీఆర్ ను విష్ చేస్తూ ఆ ఆసక్తికర సందేశం పంపింది మరోవరో కాదు.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు. చిన్న పత్రిక స్థాయి నుంచి ఈనాడును అంచెలంచెలుగా ఎదిగేలా కష్టపడిన రామోజీరావు.. రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట హైదరాబాద్ కు మరో ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేశారు. మొత్తంగా ఏ రంగంలో అడుగుపెట్టినా తనదైన ప్రత్యేకతను చాటుకున్న రామోజీ.. ప్రస్తుతం వృద్దాప్యంలోనూ యువకులకు ఏమాత్రం తగ్గని స్పీడుతోనే సాగుతున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా తనదైన శైలి వ్యూహాలతో సాగిన రామోజీ.. తెలుగు రాజకీయాలను ఏ మేర ప్రభావితం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగిల్ సెకన్ ను కూడా వేస్ట్ చేయని వ్యక్తిత్వం కలిగిన రామోజీ.. కేటీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని ఓ రోజు ముందుగానే శుక్రవారం నాడు యువ రాజకీయవేత్తకు తనదైన శైలిలో గ్రీటింగ్స్ తెలిపారు.
తండ్రిని మించిన తనయుడేనట
తెలుగు మీడియాలో ఈనాడును అగ్రగామిగా నిలిపిన రామోజీ.. కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపే విషయంలోనూ అందరికంటే భిన్నంగానే ఉండాలనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. అందరికంటే భిన్నంగా.. ఓ ముదురు కలర్ పేపర్ పై కేటీఆర్ గురించి తన మనసులోని భావనలను రామోజీ అక్షరబద్ధం చేశారు. రాజకీయాల్లో పరిణతి కలిగిన నేతగా, తండ్రిని మించిన తనయుడిగా కేటీఆర్ రాణిస్తున్నారని, ఆ వైనాన్ని తనతో పాటు అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారని రామోజీ అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కేటీఆర్ రాణించాల్సిన అవసరం ఉందని కూడా రామోజీ అభిప్రాయపడ్డారు. మొత్తంగా కేటీఆర్ కు విషెస్ తెలుపుతూ రామోజీ పంపిన ఆ సందేశం.. కేటీఆర్ తో పాటు అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి.
Must Read ;- కేటీఆర్ బర్త్ డే కానుక.. దివ్యాంగులకు స్కూటీలు!