ఏపీలో జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామికంగా ప్రగతి పడకేసిందనే చెప్పాలి. కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి తోడు అప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థలు కూడా పరుగు లంకించుకున్నాయి. ఇది కూడా చాలదన్నట్లుగా జగన్ ఇండస్ట్రియల్ పాలసీని చూసి.. అప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పరిశ్రమలు కూడా తమ యూనిట్లను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రగామిగా పేరుగాంచిన అమరరాజా బ్యాటరీస్ తన విస్తరణ ప్రణాళికలను పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తరలిస్తోందంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు అటు జగన్ సర్కారుతో పాటు ఇటు సామాన్య జనాన్ని కూడా కలవరపాటుకు గుచేశాయి. అయితే కాస్త ఆలస్యంగానైనా ఆ కంపెనీ అధినేత గల్లా జయదేవ్ అలాంటిదేమీ లేదని, తమ కంపెనీ విస్తరణ తమిళనాడుకు తరలిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
గల్లా క్లారిటీ ఏంటంటే..?
అమరరాజా తమిళనాడుకు తరలించే విషయంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ కంపెనీ అధినేత, గుంటూరు ఎంపీగా కొనసాగుతున్న టీడీపీ కీలక నేత గల్లా జయదేవ్ ప్రకటించారు. ఈ ప్రచారంపై తాము కాస్త ఆలస్యంగా స్పందించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ఒప్పేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమంటారంటే.. ‘‘నేను వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటా. గత నెల రోజులుగా పత్రికలు, టీవీ ఛానళ్లలో ఒక వార్త ప్రచారం అవుతోంది. మంచి అయినా, చెడు అయినా దానిపై మేము స్పందించలేదు. విషయం కోర్టు పరిధిలో ఉంది. కోర్టుకు సమాధానం చెబుతాం. కోర్టు నిర్ణయం తర్వాత విస్పష్టంగా స్పందిస్తాం’’ అని గల్లా జయదేవ్ తమ కంపెనీపై జరుగుతున్న ప్రచారంపై క్లిస్టర్ క్లియర్ గానే స్పందించారు. చాలా చిన్నగానే క్లారిటీ ఇచ్చిన గల్లా జయదేవ్.. తమ కంపెనీ విస్తరణ అయితే తమిళనాడుకు వెళ్లడం లేదని మాత్రం తెగేసి చెప్పేశారు. అయితే కోర్టు తీర్పు తర్వాత ఆయన ఎలా స్పందిస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.
నోటీసులు కక్షసాధింపే అయితే..
అమరరాజా వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాము ఇంతకంటే కూడా ఎక్కువగా స్పందించలేమని గల్లా జయదేవ్ చెప్పిన వైనంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుంటే.. ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగిస్తున్న అమరరాజాపై ఎప్పుడూ లేనిది ఇప్పుడే కాలుష్య కారకాల విడుదల అంటూ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసులు ఒక్క అమరరాజాకే ఇవ్వలేదని, 50 కంపెనీల మేర నోటీసులు వెళ్లాయని వైసీపీ సర్కారు చెబుతోంది. కక్షసాధింపు అయితే అమరరాజాకు మాత్రమే నోటీసులు వచ్చేవి కదా అని వాదిస్తోంది. అదే సమయంలో టీడీపీ మరో వాదనను వినిపిస్తోంది. ఎన్నడూ లేనిది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాతే అమరరాజాలో కాలుష్య కారకాల విడుదల మొదలైందా? అని టీడీపీ ప్రశ్నిస్తోంది. నోటీసులు ముమ్మాటికీ కక్షసాధింపేనని ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కోర్టులో వ్యవహారం తేలాక తాము విస్పష్టంగా స్పందిస్తామని గల్లా జయదేవ్ చెప్పారంటే.. ప్రభుత్వ నోటీసులు కక్ష సాధింపేనని తేలితే మాత్రం విస్తరణ చర్యలను తమిళనాడుకు తరలిస్తామని చెప్పేసినట్టేగా అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- టీడీపీ దెబ్బకు వైసీపీకి బొమ్మ కనిపిస్తోందే











