నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రైతుల నుంచి భూములు సేకరించిన వైనంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ ఆది నుంచి ఆరోపిస్తోంది. అయితే ఆ ఆరోపణలకు ఆధారాలేమిటన్న విషయంపై మాత్రం ఆ పార్టీ గానీ, ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం గానీ పెద్దగా పట్టించుకున్న దాఖలా అయితే కనిపించలేదనే చెప్పాలి. దళితులు, మాజీ సైనికులకు చెందిన భూములను ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కంటే ముందుగానే.. నాటి టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలు, వారి అనుచరులు, చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారు బలవంతంగా లాగేసుకున్నారని, పూలింగ్ ప్రకటన వచ్చాక.. ఆ భూములను ప్రభుత్వానికి ఇచ్చేసి భారీ ఎత్తున లబ్ధి పొందారన్నది జగన్ అండ్ కో వాదన. ఈ లెక్కన ల్యాండ్ పూలింగ్ కు ముందే క్రయవిక్రయాలు జరిగిన భూముల ద్వారా దళితులు, మాజీ సైనికులు మోసపోయారన్నది జగన్ వాదన. ఇదే వాదనతో ముందుకు సాగిన జగన్.. ఆ వాదనను కోర్టుల్లో నెగ్గించుకునే విషయంపై మాత్రం అంతగా దృష్టి సారించలేదనే చెప్పాలి. అందుకే.. ఈ కేసును హైకోర్టు ఆదిలోనే కొట్టేయగా.. సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ సర్కారుకు ఎదురు దెబ్బే తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసలు బాదితులు ఎక్కడ?
ఏ కేసు అయినా అన్యాయం జరిగిన వారి వాదనలే కీలకం. అసలు బాధితులు ఎవరో చెప్పకుండా.. వారికి జరిగిన నష్టమేంటో చెప్పకుండా.. అసలు ఆ జరిగిన నష్టం ఎంతో చెప్పకుండా.. అసలు బాధితుల నుంచే ఫిర్యాదులు లేకుండా.. కేసులు నమోదు చేసి దర్యాప్తు అంటే కోర్టులేమీ చోద్యం చూస్తూ ఊరుకోవు కదా. ఇక్కడా అదే జరిగింది. బాధితుల ఫిర్యాదులు లేకుండా.. మాకు సమాచారం అందింది.. దర్యాప్తు చేస్తాం.. ఫలానా వారు నిందితులు.. వారిని విచారిస్తాం.. అంటే కోర్టులు ఒప్పుకోవు కదా. జగన్ అండ్ కో ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయి.. నేల విడిచి సాము చేస్తే.. నిందితులు మాత్రం సహజ న్యాయ సూత్రాలను ఆధారం చేసుకుని జగన్ సర్కారుకు బ్రేకులు వేసేశారు. అసలు జరిగిన అన్యాయమేమిటన్నది తెలియకుండానే.. తమను నిందితులు అంటూ ఎలా పిలుస్తారని, తమపై కేసులు నమోదు ఎలా చేస్తారని, దర్యాప్తు ఎలా కొనసాగిస్తారని.. ఇలాంటి విచారణలకు తామెందుకు సహకరించాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఏ కోర్టు అయినా.. సహజ న్యాయ సూత్రాలను పరిశీలించాకే కేసు జోలికి వెళుతుంది కదా. ఇక్కడా హైకోర్టు ఇదే విషయాన్ని పరిశీలించి ఈ కేసులో అసలు నిందితులెవరో తెలియదని, అలాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ దర్యాప్తు కొనసాగించడం కుదరదని సింగిల్ మాటతో ఇన్ సైడర్ దర్యాప్తును నిలుపుదల చేసింది.
అప్పటికీ ఆధారాల సేకరణ పట్టలేదు
అయితే హైకోర్టు తీర్పుతో అహం దెబ్బతిన్నట్లుగా వ్యవహరించిన జగన్ సర్కారు.. హైకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా ఆధారాలు లేకుండా కేసు దర్యాప్తు సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించలేదనే చెప్పాలి. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేసి ఈ కేసు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. అయితే జగన్ సర్కారు కేసు నమోదు చేసిన తీరుతో పాటు దానిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, వెలిబుచ్చిన అభ్యంతరాలు, వ్యక్తం చేసిన అబిప్రాయాలు, అంతిమంగా తీర్పు ఇచ్చిన వైనాన్ని సుప్రీంకోర్టు క్షుణ్ణంగానే పరిశీలించింది. ఈ సందర్భంగా జగన్ సర్కారు నేల విడిచి సాము చేసిన వైనాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేమీ లేదని కూడా గుర్తించింది. వెరసి హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ప్రకటిస్తూ.. జగన్ సర్కారు చేసిన వినతిని తోసిపుచ్చింది. వెరసి అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలనే సుప్రీంకోర్టు కూడా మరింత గట్టిగా చెప్పింది. అప్పటికి గానీ బుద్ది రాని జగన్ సర్కారు.. ఈ కేసు విషయంలో తాను చేసిన తప్పును గుర్తించి.. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. మొత్తంగా నేలవిడిచి సాము చేసిన జగన్ సర్కారు.. చివరాఖరుకు సుప్రీం ఆగ్రహంతో్ తన తప్పును ఒప్పేసుకుందన్న మాట. అంటే.. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిన్నటిదాకా గగ్గోలు పెట్టిన జగన్ సర్కారు.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని ఒప్పేసుకుందన్న మాట.
Must Read ;- తెలుగుదేశంలో నవ్యోత్తేజం!