నిజమే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అదికారులు జైలుకు వెళుతున్నారు. అదేంటో గానీ… వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా ఇద్దరు సీఎంలు అయితే… వారిద్దరి కారణంగా ఐఏఎస్ లు జైలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పాలనలో మంగళవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది. జగన్ జమానాలో కీలక శాఖల అధికారులుగా కొనసాగుతున్న ఐఏఎస్ లు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరిలకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
వైఎస్ జమానాలో ఎన్నెన్ని కేసులో..
వైఎస్సార్ సీఎంగా ఉండగా… తండ్రి అధికారాన్ని ఆసరా చేసుకుని జగన్ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారు. ఫలితంగా ఆయనపై ఇటు సీబీఐతో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ఎలాగోలా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉండే సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ బెయిల్ కూడా ఎప్పుడు రద్దు అవుతుందోనన్న భయంతోనే జగన్ బిక్కుబిక్కుమంటూనే కాలం వెళ్లదీస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ తన రాజకీయ బలాన్ని వినియోగిస్తున్నా… ఆయన కారణంగా బుక్కైపోయిన ఐఏఎస్ లు మాత్రం ఆ కేసుల నుంచి బయటపడలేక నానా అవస్థలు పడుతున్నారు.
కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకే..
తాజాగా ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోతోంది. జగన్ తన పాలనలో కోర్టుల ఉత్తర్వులను, ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని విధంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలు పాటించకుండా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 36 మంది ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు ఏప్రిల్ లో ఆదేశాలు జారీ చేస్తే… వీరు వాటిని ఇప్పటిదాకా అమలు చేయలేదు. దీంతో గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాల మేరకు మంగళవారం వీరిద్దరూ విచారణకు హాజరు కాగా.. వారిద్దరికీ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
Must Read ;- ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు