What Is The Result of YS Sharmila Survey :
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి తనయ వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వేరుపడి తెలంగాణ రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. బుధవారం ఆమె తన పార్టీని హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నారు. బుధవారం ఉదయం తన తండ్రి వైఎస్సార్ కు కడప జిల్లా ఇడుపులపాయలో నివాళి అర్పించిన తర్వాత నేరుగా హైదరాబాద్ చేరుకునే షర్మిల.. సాయంత్రం పార్టీని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. భారీ ఎత్తున కేడర్ ను తరలించుకుని ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలని షర్మిల తలచినా.. కరోనా నిబంధనలు అందుకు అనుమతించడం లేదు. దీంతో పరిమిత సంఖ్యలోనే పార్టీకి చెందిన ముఖ్య నేతలతోనే ఆమె తన పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకోనున్నారు.
అన్నీ ప్రశ్నలే..
ఇదిలా ఉంటే.. ఏపీకి చెందిన తాను తెలంగాణ కోడలినని చెప్పుకున్న షర్మిల.. తనను తెలంగాణ జనం ఎలా ఆదరిస్తారోనన్న ఆందోళనలోనే ఉన్నారు. బయటకు గట్టిగానే మాట్లాడుతున్న ఆమె లోలోపల మాత్రం తన తండ్రి అంటే అభిమానం ఉన్న వారు ఇప్పటికీ తన అదే భావనతో ఉన్నారా? ఇప్పుడు తాను పార్టీ పెడితే వారంతా తన వెంట నడుస్తారా? నడవకపోతే పరిస్థితి ఏమిటి? అసలు తన బలం తెలంగాణలో ఏ మేర ఉండనుంది? ఎక్కడెక్కడ బలం ఉంది? ఎక్కడెక్కడ లేదు? ఏ అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది? వంటి అంశాలపై షర్మిల చాలాకాలంగానే ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వద్ద శిక్షణ పొందిన తమిళ యువతి ప్రియను తన పార్టీకి వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న షర్మిల.. తనలోని అనుమానాలన్నింటినీ తీర్చుకునే దిశగా రహస్య చేయించుకున్నారట.
77 నియోజకవర్గాల్లో రహస్య సర్వే
గడచిన మూడు నెలలుగా అత్యంత రహస్యంగా జరిగిన ఈ సర్వేను తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో 77 స్థానాల్లో నిర్వహించారట. ఇప్పటికే ఈ సర్వేకు చెందిన నివేదికను ప్రియ ఇటీవలే షర్మిలకు అందజేశారట. ఈ నివేదకను అందజేసే క్రమంలోనే ఇటీవల ప్రియ హైదరాబాద్ లోని షర్మిల నివాసం లోటస్ పాండ్ కు వచ్చారట. ఇలా పార్టీ ఆవిర్భావానికి ముందే షర్మిల ఇంటికి ప్రియ రావడంతోనే ఆమెను షర్మిల తన పార్టీకి వ్యూహకర్తగా నియమించుకున్నట్టుగా తేలింది. మూడు నెలల పాటు ఏ ఒక్కరికి అనుమానం రాకుండా ప్రియ చేసిన సర్వేను ఇప్పుడు షర్మిల వర్గం కూలంకషంగా పరిశీలిస్తోందట. నివేదికలోని అంశాల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.
వైఎస్సార్ పై తెలంగాణ వ్యతిరేకి ముద్ర
అయినా ఈ నివేదికలో ప్రియ.. షర్మిలపై తెలంగాణ ప్రజల్లో ఉన్న భావమేమిటన్న విషయాన్ని ఏ మేర పట్టగలిగారన్నది ఆసక్తీకరంగా మారింది. వైఎస్సార్ 2009లోనే మరణించారు. ఆయన మరణం తర్వాతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. వైఎస్సార్ బతికి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్న మాటే వినబడకపోయేదన్న వాదనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ పై తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర అయితే ఉంది. అయితే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలపై మాత్రం తెలంగాణలోనూ ఓ మోస్తరు సానుకూలత ఉంది. మరి వైఎస్సార్ మృతి చెంది అప్పుడే పదేళ్లు దాటిపోతోంది. ఈలోగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ప్రియ ఆధ్వర్యంలో జరిగిన రహస్య సర్వేలో.. షర్మిలకు ఎలాంటి పరిస్థితులు స్వాగతం చెప్పనున్నాయన్న విషయం బట్టబయలైనట్లే చెప్పాలి. మరి ఆ పరిస్థితి ఏమిటన్నదానిపై జనంలో ఆసక్తి పెరిగింది.
Must Read ;- ఇద్దరి టార్గెట్ సేమ్.. గోల్ ఎవరికో..?