AP High Court Gives Green Signal For Counting Of Votes In Parishad Elections :
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా రెండో రోజు కూడా సానుకూల తీర్పే వచ్చింది. బుధవారం నాడు బెయిల్ రద్దు పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేయగా.. గురువారం నాడు ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు అనుమతి ఇస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు చెప్పింది. వెరసి బుధవారం నాడు భారీ ఊరట దక్కిన జగన్ కు ఆ మరునాడు గురువారం విక్టరీ లెక్కలు చూసుకుని సంబరపడిపోయే అవకాశం దక్కింది. ఇలా వరుసగా రెండు తీర్పులు అనుకూలంగా రావడంతో జగన్ ఖుషీఖుషీగా కనిపిస్తుండగా.. వైసీపీ శ్రేణులు మాత్రం సంబరాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే వైసీపీ శ్రేణులు ఈ సంబరాలను చాలా గ్రాండ్ గా జరుపుకునే అవకాశం ఉంది.
పరిషత్ కౌంటింగ్ కు ఓకే
ఏపీలో గత కొంత కాలం క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కండబలం చూపిన వైసీపీ పంచాయతీ ఎన్నికలతో పాటు మునిసిపల్ ఎన్నికలను విక్టరీతో ముగించింది. మెజారిటీ పంచాయతీలను చేజిక్కించుకున్న వైసీపీ.. అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీ మినహా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన అన్ని పురపాలికలపై తన జెండా ఎగురవేసింది. అయితే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసినా.. హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును వైసీపీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. దీనిపై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్.. గురువారం ఉదయమే పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దీంతో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే తేదీని ప్రకటించనుంది.
పరిషత్ విజేతలెవరో..?
స్థానికి సంస్థల ఎన్నికల్లో భాగంగా అటు పంచాయతీలతో పాటు మునిసిపాలిటీపైనా జెండా ఎగురవేసిన అధికార వైసీపీకే.. పరిషత్ ఎన్నికల్లోనూ మెజారిటీ దక్కే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. పరిషత్ ఎన్నికల్లో దాదాపుగా 60 శాతానికి పైగా స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికలు అనివార్యమైన స్థానాల్లోనూ వైసీపీ శ్రేణులు అధికార బలంతో పాటు కండబలాన్ని కూడా వినియోగించారన్న వాదనలూ పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నేపథ్యంలో పరిషత్ ఫలితాలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు జగన్ కు అన్నీ అనుకూలంగానే వస్తున్న వైనం ఆసక్తిత్తిస్తోంది.
Must Read ;- జగన్‌కు రిలీఫ్.. సాక్షిని బుక్ చేసిందే